పూజారులు, జర్నలిస్టులపై కేసులా! జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్ 

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడులపై రాజకీయ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆలయాలపై దాడులకు సంబంధించి పూజారులు, జర్నలిస్టులపై కేసులు పెట్టడం దుమారం రేపుతోంది. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండకు చెందిన జర్నలిస్టుపై కేసు నమోదైంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖ ద్వారంపై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకే అతనిపై పోలీసులు కేసు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. పూజరి, జర్నలిస్టుపై కేసు పెట్టడంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు తీవ్రంగా స్పందించారు. 

ఆలయ పూజారి పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం సరికాదని చంద్రబాబు అన్నారు. 140 ఆలయాలపై దాడులు జరుగుతున్నా దోషులను పట్టుకోలేదన్నారు. టీడీపీ కార్యకర్తలుగా ముద్రవేసి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలే కావాలని ఇదంతా చేయిస్తున్నారని తాము కూడా అనాలా? అని ప్రశ్నించారు. అమాయకులను కేసుల్లో ఇరికించ వద్దన్నారు.ఆలయాల ఎదురుగా దుకాణం నడిపేవారిని స్టేషన్‌కు తీసుకెళ్లారా?..అమాయకులను స్టేషన్‌లో పెట్టి వేధిస్తారా? అని ప్రశ్నించారు.

నిందితులను గాలికొదిలేసి సమాచారం ఇచ్చిన వ్యక్తులను, వార్త రాసిన జర్నలిస్టులను వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని నారా లోకేష్ విమర్శించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖ ద్వారంపై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకు జర్నలిస్టుల పై అక్రమ కేసులు పెట్టి వేధించడం వైఎస్ జ‌గ‌న్  మూర్ఖత్వానికి పరాకాష్ట అని లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 140 ఘటనలు జరిగితే నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి సమాచారం బయటపెట్టిన వ్యక్తులు, జర్నలిస్టుల పై అక్రమ బనాయిస్తుందని ధ్వజమెత్తారు.వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అమాయకులపై కేసులు పెడుతున్న కొంతమంది పోలీసులు పర్యవసానం అనుభవించక తప్పదని లోకేష్ హెచ్చరించారు.  ముందే విగ్రహాలు విరిగిపోయాయని మాయచేస్తున్న ప్రభుత్వం మరమ్మత్తులు ఎందుకు చెయ్యలేదు... వాస్తవాలు బయటకొచ్చాకా ఎదో తప్పుడు కథలు చెప్పడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది  అని నారా లోకేష్ విమ‌ర్శించారు.