TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుతో మళ్లీ జతకట్టిన బిల్‌గేట్స్...

Published on: Sat Jul 16, 2016 4:32PM

మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌తో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు తన హైటెక్ పరిపాలనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ప్రపంచం మొత్తం మైక్రోసాఫ్ట్ వైపు చూస్తోన్న సమయంలో ఆ మైక్రోసాఫ్ట్‌ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు చంద్రబాబు. ఐటీ రంగానికి బాబు ఇస్తోన్న ప్రాధాన్యతను గుర్తించిన బిల్‌గేట్స్ హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అలా వీరిద్దరి బంధం మరింతగా బలపడి వ్యక్తిగత స్నేహంగా మారింది. గేట్స్ సహకారంతో చంద్రబాబు హైదరాబాద్‌లో ఐటీని పరుగులు పెట్టించారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు పదేళ్లు అధికారానికి దూరమయ్యారు.

 

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి, ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేశారు. అలా దావోస్‌లో పర్యటిస్తుండగా ఆయనకు బిల్‌గేట్స్ ఎదురుపడ్డారు. దాదాపు 10 సంవత్సరాల తరువాత చంద్రబాబును చూసి గేట్స్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పారు ముఖ్యమంత్రి. మీరేం భయపడొద్దని..అండగా ఉంటానని గేట్స్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. డిజిటల్ ఏపీ ప్రాజెక్ట్‌తో పాటు..ఐటీ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ భాగమవుతుందని అన్నారు.

 

నిన్న బిల్‌గేట్స్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం ఏపీలో పేదలకు వైద్య సేవల విస్తృతికి సహకరించాలని కోరారు. గేట్స్ తన భార్య పేరు మీద బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్ధాపించి ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఏపీలో పట్టణ పారిశుద్ధ్య రంగంలోనూ, సెర్ప్‌తోనూ కలిసి పనిచేస్తున్న గేట్స్ ఫౌండేషన్ ఎన్టీఆర్ వైద్యసేవలోనూ సహకరించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో నిర్వహిస్తున్న ఇ-ప్రగతి కార్యక్రమానికి సలహాదారుగా వ్యవహరించాలని, ఆసక్తి ఉన్న ఇతర సంస్థల్ని భాగస్వాముల్ని చేయాలని సీఎం బిట్‌గేట్స్‌ను కోరారు. దీనిపై స్పందించిన గేట్స్... "ఫౌండేషన్" ప్రతినిధులు ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోలుకు ఫౌండేషన్ తరపున సాయం అందిస్తామని చెప్పారు. అప్పుడు ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువైన బాబు-గేట్స్ జోడీ మరోసారి జతకడుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.