ఏపీలో… ఏప్రెల్ 2 విడుదల?

 

ఏప్రెల్ 2 విడుదల… అదేంటీ ఏప్రెల్ 1 విడుదల అనేది కదా సినిమా పేరు అంటారా? మనం మాట్లాడుకుంటోంది సినిమా గురించి కాదండీ! అంతకంటే, ఆసక్తికరమైన క్యాబినేట్ విస్తరణ గురించి! ఏపీ క్యాబినేట్ విస్తరణ గత కొన్ని నెలలుగా ఊరిస్తూ ఉసూరూమనిపిస్తోన్న వ్యవహారం. పాపం… నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేశామన్న ఆనందం చాలా మంది టీడీపీ నేతల్లో కనిపించాల్సినంత కనిపించటం లేదు. అందుక్కారణం, అమరావతిలో చంద్రబాబు సర్కార్ ఏర్పడి రెండున్నరేళ్లు దాటిపోయినా విస్తరణ వర్కవుట్ కావటం లేదు. దాంతో మంత్రులవ్వాలని కళ్లలో వత్తులు వేసుకున్న వారంతా అసహనంగా పడిగాపులు పడుతున్నారు!

 

ఎప్పుడో పోయిన సంవత్సరం దసరా కంటే ముందు నుంచీ మంత్రి పదవులు ఊరిస్తున్నాయి చాలా మంది టీడీపీ నేతల్ని. కాని, ఎంతకూ కసరత్తులు తెగక పోవటంతో దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి… ఇలా అన్నీ గడిచిపోతూనే వున్నాయి. ఇప్పుడు తాజా టాక్ ప్రకారం … చంద్రబాబు నాయుడు ఏప్రెల్ రెండును మూహూర్తంగా ఖరారు చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇది కూడా ఫైనల్ అనలేకపోతున్నారు. ఏప్రెల్ ఆరవ తేదీన విస్తరణ తప్పుకుండా జరుగుతుందని కూడా కొందరంటున్నారు! కాకపోతే, దేనిపైనా అధికారిక ప్రకటన మాత్రం లేదు. కాబట్టి క్యాబినేట్ సస్పెన్స్ మరింత కాలం కొనసాగే సూచనలే కనినిస్తున్నాయి.

 

గతంలో చాలా సార్లు క్యాబినేట్ రిషఫుల్ అని హడావిడి జరిగినా వ్యవహారం మాత్రం ముందుకు పోలేదు. కాని, ఇప్పుడు తప్పకుండా జరిగే ఛాన్సెస్ వున్నాయంటున్నారు. ప్రధానం కారణం చిన బాబు లోకేషే! ఈసారి ఆయన కూడా ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసి సమరోత్సాహంతో వుండటంతో… చంద్రబాబు తప్పకుండా తనయుడ్ని క్యాబినేట్లోకి తీసుకుంటారని వాదన వినిపిస్తోంది. ఇక లోకేష్ తో పాటూ మరో యువ నేత భూమా అఖిలప్రియ కూడా మంత్రి అవుతారని అంటున్నారు. వీరిద్దరు కాకుండా మిగతా వారి పేర్లన్నీ డౌట్ ఫుల్ గా ప్రచారం జరుగుతున్నాయి. ప్రతీ జిల్లా నుంచీ చాలా పేర్లే వినిపిస్తున్నాయి. కొన్నిటికి కులం ఆధారమైతే, కొన్నిటికి ప్రాంతం, మరి కొన్నిటికి సామాజిక వర్గం ఆధారంగా నిలుస్తున్నాయి! మొత్తం మీద అయిదేళ్ల కాలంలో… సరిగ్గా సగం పూర్తయ్యాక జరగనున్న ఈ విస్తరణ… నెక్స్ట్ ఎన్నికల ఫలితాలపై బోలెడు ప్రభావం చూపుతుంది! మరి దీన్ని ఎంతో ఓర్పు, నేర్పు వున్న చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.

 

కొత్త మంత్రి వర్గంలో పని చేసే సత్తాకి పెద్ద పీట వేస్తారా? లేక కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య బేరీజులకే ప్రాధాన్యం ఇస్తారా? ఇది తేలాలంటే ఏప్రెల్ రెండు వరకో, ఆరు వరకో ఆగాల్సిందే!