ఆంధ్రప్రదేశ్ అవార్డ్ అందుకుంది!

అవార్డ్ వస్తే ఉల్లాసం, రివార్డ్ వస్తే ఉత్సాహం ఎవరికైనా సహజమే! ఒక కొత్త రాష్ట్రానికి కూడా ఒక ప్రతిష్ఠాత్మక అవార్డ్ వస్తే మంచి ప్రేరణా, ప్రొత్సాహం లభిస్తాయి. అదే జరిగింది మన నవ్యాంధ్రకి సీఎన్ బీసీ అవార్డుల వేదికపై! కనీసం రాజధాని కూడా లేకుండా 2014లో ఏర్పడ్డ నూతన ఆంధ్రప్రదేశ్ మూడేళ్లలో చాలా ముందుకే దూసుకొచ్చింది! అన్నీ అద్బుతాలే అని మనం చెప్పుకోలేకున్నా అవార్డ్ పొందగలిగే అంత వేగాన్నైతే పుంజుకుంది!

 

ఢిల్లీలో సీఎన్ బీసీ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అందుకున్నారు మంత్రి అయ్యన్నపాత్రుడు! అదే వేదికపై నుంచీ సరికొత్త ఆంధ్రప్రదేశ్ వినూత్న అభివృద్ధి పంథాను చంద్రబాబు వివరించారు. అమరావతి లాంటి అపురూప రాజధాని నిర్మాణం చేసుకుంటూనే అన్ని రంగాల్లో ముందుకుపోతున్నామని చెప్పారు. దేశంలో రెండంకెల అభివృద్ధి కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే సాధించిందని సగర్వంగా చెప్పారు. అయితే, తమ సత్తా సీఎన్ బీసీ లాంటి గొప్ప సంస్థలు జాతీయ స్థాయి వేదికలపై గుర్తిస్తున్నా... ప్రతిపక్షం మాత్రం పసిగట్టలేకపోతోందంటూ చురకులు వేశారు! 

 

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నేతని టార్గెట్ చేయటం మాటెలా వున్నా ఏపీ ప్రతిష్ఠాత్మక స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అందుకోటం నిజంగా సంతోషించాల్సిన విషయం. కాకపోతే, అవార్డ్ అందుకుంటూనే సీఎం చెప్పిన మాటలు ఎంతో సత్యం కూడా. అవార్డ్ అందించిన అరుణ్ జైట్లీని ఉద్దేశించి బాబు కేంద్ర సహకారం మరింత కావాలన్నారు. ప్రత్యేక హోదా రాకపోయినా కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కి మోదీ సర్కార్ మరింత సాయం చేయాలన్నది మాత్రం నిజం. అది జరిగితే ఇక మనకు తిరుగుండదు!

 

ఈ సారి సీఎన్ బీసీ అవార్డుల్లో మరో అవార్డ్ కూడా తెలుగు వారికే దక్కింది. అమర్ రాజా బ్యాటరీస్ మోస్ట్ ప్రామిసింగ్ అవార్డ్ గెలుచుకుంది! ఈ అవార్డ్ ని ఎంపీ గల్లా జయదేవ్ అందుకున్నారు!