చంద్రబాబు దీక్షతో కాంగ్రెస్ పార్టీకి ఇరకాటం

 

రాష్ట్రవిభజనపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ డిల్లీలో ఆంధ్ర భవన్ వద్ద నిన్నటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చంద్రబాబు నాయుడు ఊహించినట్లే కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడం ద్వారా ఇంతకాలంగా రాష్ట్ర విభజనపై సీమంధ్రలో జరుగుతున్నఉద్యమాలను అంతగా పట్టించుకోని జాతీయ మీడియా దృష్టికి కూడా తేగలిగారు. ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు చాలా ఆలోచింప జేస్తున్నాయి.

 

రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వాటిని సరిద్దిద్దామని రాష్ట్రపతిని కోరినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కేంద్రం, సీమాంధ్ర ప్రజల ఆందోళన పట్ల కనీస స్పందన చూపకపోవడం వలననే నేడు రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సంబందించిన ఈ అంశంపై వారికి సరయిన వివరణ ఈయకపోగా కేంద్రం ఎందుకు అంత రహస్యంగా టీ-నోట్ ను ఆమోదించవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈవిషయంలో తన రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది గనుకనే దానిని ఈవిధంగా దొంగచాటుగా ఆమోదించవలసి వచ్చిందని, లేకుంటే అదేవిషయం ముందుగానే మీడియాకు తెలియజేసి మరీ ఆమోదించి ఉండేదని ఆయన ఆరోపించారు.

 

కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయకోణం నుండే పరిష్కరించాలని ప్రయత్నించుతున్నందున, అది తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్, షిండే వంటి కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు పొంతన లేని విధంగా మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలని ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈవిధంగా తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకొనే హక్కు మీకెవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

 

కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కోసం తన పార్టీని నేతల రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెడుతున్నట్లు ఆ పార్టీకి చెందిన నేతలే చెపుతున్న మాటలను మీడియాకు వివరించి, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ తీయడం కోసం, కాంగ్రెస్ పార్టీ తన స్వంత పార్టీని, నేతలను కూడా బలిచేసుకోవడానికి సిద్దపడుతోందని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని హేళన చేసారు.

 

చంద్రబాబు నాయుడు డిల్లీలో నిరాహార దీక్షకు దిగుతున్నపుడు కాంగ్రెస్ అధిష్టానం దానిని చాలా తేలికగా తీసిపడేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన మొదటిరోజే జాతీయ మీడియా ముందు ఈవిధమయిన ప్రశ్నలు లేవనెత్తడంతో కాంగ్రెస్ అధిష్టానం చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోబోతోంది.