చంద్రబాబును అధిగమించాలనే...

 

దేశంలో మూడో ఫ్రంట్ రావాలని, దానికోసం తాను కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే టీఆర్ఎస్ వర్గాలు ఆనందంతో ఉరకలు వేయడం ప్రారంభించాయి. మూడో ఫ్రంట్‌కి కేసీఆర్ నాయకత్వం వహించేసినట్టు, ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధానమంత్రి అయినట్టు, తెలంగాణకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయినట్టు, కేసీఆర్ ప్రధానమంత్రిగా దేశం, కేటీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వున్నట్టు కలలు కనడం ప్రారంభించేశారు. కేసీఆర్ ఇలా థర్డ్ ఫ్రంట్ గురించి ప్రకటించారో లేదో... అలా పలు ప్రాంతీయ పార్టీల నాయకులు కేసీఆర్‌కి ఫోన్ చేసి మరీ మద్దతు తెలిపారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ ఉత్తుత్తి వార్తలేనని, కేసీఆర్‌కి ఎవరూ ఫోన్ చేయలేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమిటో ఆ పైవాడికే తెలియాలి.

 

తెలంగాణ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు అందర్నీ ఒక్కతాటి మీదకు తీసుకురావడం... ఆ తర్వాత ఎవర్ని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచి, తాను ఎక్కడ వుండాలో అక్కడే వుండే నైపుణ్యం కేసీఆర్‌కి బాగా వుంది. థర్డ్ ఫ్రంట్ విషయంలో కూడా కేసీఆర్ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్ళినా, అనుకున్నది సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తన రాజకీయ చతురతతో సోనియాగాంధీనే మాయచేసిన టాలెంట్ ఆయన సొంతం. తన టాలెంట్‌ని సరైన విధంగా ఉపయోగించుకుని దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కేసీఆర్ భావించడం సమంజసమేనని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంత అకస్మాత్తుగా కేసీఆర్‌కి ప్రధానమంత్రి అవ్వాలన్న ఆలోచన రావడానికి కారణమేంటనే పాయింట్‌ మీద అందరి దృష్టీ నిలిచింది.

 

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా, బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్రాలను చిన్న చూపు చూడటం మామూలైపోయిందని కేసీఆర్ చెబుతున్నది పైపైన కనిపించే కారణం. అయితే లోపల వున్న అసలు కారణం చంద్రబాబుకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఇమేజేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇటీవల అమరావతిని సందర్శించిన సందర్భంలో చంద్రబాబు లాంటి వ్యక్తికి ‘‘ఇంకా  పెద్ద బాధ్యతలు అందాలి’’ వ్యాఖ్యానించారు. అంబానీ అలా అనడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. చంద్రబాబు ప్రధాని అవ్వాలని ముకేష్ కోరుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అయితే తనకు జాతీయ రాజకీయాలకు వెళ్ళే ఉద్దేశం లేదని క్లారిటీగా చెప్పేశారు. ఈ సందర్భంలో తాను జాతీయ రాజకీయాలకు ఎందుకు వెళ్ళకూడదన్న ఫ్లాష్ కేసీఆర్‌ మదిలో వెలగడం వల్లే థర్డ్ ఫ్రంట్ ఆలోచన పుట్టుకొచ్చిందని విశ్లేషిస్తున్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబుకు వున్న ఇమేజ్ కంటే ఎక్కువ ఇమేజ్ సాధించే ఉద్దేశంతోనే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అస్త్రంతో ముందుకు వచ్చారని అంటున్నారు.