అపర చాణుక్యుడికి 40 ఏళ్లు

నారాచంద్రబాబు నాయుడు.. టీడీపీ అధినేతగా.. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్‌గా.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన అతికొద్దిమంది నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఇంత ఘనకీర్తికి బీజం పడి నేటికి సరిగ్గా 40 ఏళ్లు. 66 ఏళ్ల జీవితంలో ఓ వ్యక్తి నాలుగు దశాబ్ధాలను రాజకీయాలకే కేటాయించడం ఒక్క చంద్రబాబు విషయంలోనే సాధ్యమైంది.

 

1977లో ఎమర్జెన్సీతో నాటి ప్రధాని ఇందిరాగాంధీని గద్దె దించి.. జనతాపార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు దేశప్రజలు. అప్పటికి చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించారు.. ఆ మరుసటి ఏడాది 1978 ఫిబ్రవరి 25లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. పార్టీలో చీలికలు, అసమ్మతి సెగలతోనే ఇందిర ఎన్నికలకు వెళ్లారు. అయితే ఇందిరా కాంగ్రెస్‌కు ఏపీలో అభ్యర్ధులు కరువయ్యారు. అప్పుడే ఇందిర కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో యువతకి పెద్దపీట వేశారు. అలా తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో విద్యార్థి నేతగా ఉన్న చంద్రబాబుకు చంద్రగిరి టికెట్ దొరికింది. అయితే బాబు ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఆషామాషీ నేత కాదు.. పట్టాభి చౌదరి.. చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో మంచి పలుకుబడి ఉన్న నాయకుడు.

 

ఎన్నికల్లో ఆయనదే విజయమని జనం మాట్లాడుకుంటున్న టైంలో.. బాబు వెంట ప్రచారం చేసే వారే లేరు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న చంద్రబాబు నాయుడు. తన మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. "అమ్మా మీ ఓటు నాకే" అంటూ ఓటర్లను కోరారు. అప్పటి రోజుల్లో ప్రచారం ఉండేది కాదు.. ఊళ్లో పెద్ద మనుషులకే ఓట్లు వేయించే బాధ్యతను అప్పగించేవి ఆయా పార్టీలు.. అయితే చంద్రబాబు ప్రజల వద్దకే వచ్చి ఓట్లు అడగటంతో.. జనం కొత్తగా ఫీలయ్యారు. దీని ఫలితంగా ఫిబ్రవరి 27న వెలువడిన ఫలితాల్లో పట్టాభి చౌదరిపై 2494 ఓట్ల మెజారిటీతో బాబు ఘన విజయం సాధించారు.

 

అలా ఇందిరా గాంధీ పుణ్యాన జాతి గర్వించదగ్గ ఓ రాజకీయ వేత్త దేశానికి పరిచయమయ్యాడు. అక్కడి నుంచి చంద్రబాబు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అడుగ‌డుగునా ఎన్నో ఒడిదొడుకులు. ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నో స‌వాళ్లూ సంక్షోభాలు. అలాంటి స‌మ‌యాల్లో కూడా ధైర్యంగా నిల‌బ‌డి, అవ‌కాశాల‌ను వెతుక్కుంటూ స‌వాళ్ల‌ను అధిగ‌మించుకుంటూ సాగుతున్నారు. 40 ఏళ్ల అనుభవంలో పోరాటాలు.. నిర్మాణాలు.. నిర్ణయాలు.. మలుపుతిప్పిన అడుగులు.. అన్నీ కలబోసి ఏకం చేస్తే రూపుదిద్దుకున్న రూపమే నారా చంద్రబాబు నాయుడు. మోడ్రన్ తెలుగుజాతి నిర్మాతల్లో అగ్రస్థానాన నిలవగలిగిన వ్యక్తుల్లో బాబు ఖచ్చితంగా ఉంటారు. నిజంగా ఆయ‌న లేకుంటే.. రాజ‌కీయాల్లోకి రాక‌పోయి ఉంటే ఏమై ఉండేది అని ఒక్క‌సారి ఆలోచించుకుంటే ఎక్కువ‌మందికి క్వ‌శ్చ‌న్ మార్కే క‌నిపిస్తుంది.