బాబు చుట్టూ అష్టదిగ్భంధనం..?

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన మాట విననివారిని.. తనకు అడ్డుగా ఉంటారని భావించిన వారిని బీజేపీ పెద్దలు ఎలా దారికి తెచ్చుకున్నారో దేశం మొత్తం చూసింది. తమిళనాడులోని కొందరిపై సీబీఐ, ఈడీలు ఇంకా ఫోకస్ చేస్తూనే ఉన్నాయి.. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏకంగా పోలీసులు సోదాలు చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో.. దీని వెనుక ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభజన హామీలతో తనపై కయ్యానికి కాలుదువ్వడంతో పాటు బీజేపీయేతర శక్తులన్నింటిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాస్తంత గుర్రుగానే ఉన్నారు.

 

రాయబారాలతో టీడీపీ అధినేత మాట వింటే సరే. లేకపోతే బాబును ఎలా దారికి తెచ్చుకోవాలనే దానిపై కమలనాథులు.. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే మరుగున పడిపోయిన రెండు విషయాలను బీజేపీ తవ్వి తీస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల మధ్యలో పుట్టిన ప్రత్యేక రాయలసీమ వాదం, తర్వాత జరిగిన పరిణామాలతో చల్లబడిపోయింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు హాడావిడి చేసినా జనం నుంచి స్పందన రాకపోవడంతో.. ఆయన కూడా ఆ ఆలోచనను విరమించుకున్నారు.

 

అయితే నిన్న జరిగిన సమావేశంలో ఏపీ బీజేపీ నేతలు రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించారు. కర్నూలును రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయాలని.. హైకోర్టును సీమలో పెట్టాలని.. నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలుగా విభజించాలని.. ఇంకా చాలా చాలా డిమాండ్లు తెరమీదకు తీసుకువచ్చి విభజన రాజకీయాలకు తెరలేపారు. ఇది జరిగిన కాసేపటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ కదిలింది.

 

ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్న మత్తయ్య తాను అప్రూవర్‌గా.. మారుతున్నట్లు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనం కలిగించింది. ఇప్పటిదాకా చడీ చప్పుడు లేకుండా ఉన్న ఈ కేసులో ఉన్నపళంగా చలనం రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సెపరేటిజంతో పాటు పాత కేసులు బయటకు తీసి చంద్రబాబుకు ఊపిరి సలపకుండా చేసి.. రాజీకి వచ్చేలా చేయాలని.. తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.