మార్చి 5న చంద్రబాబు ఏం చేయబోతున్నారు...?

వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి.. జనాన్ని ఆకర్షించడానికి వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధన కోసం తన ఎంపీల చేత పార్లమెంట్‌లో ఆందోళన చేయించిన జగన్.. ప్రత్యేకహోదా నినాదంతో సెంటిమెంట్‌ను రగిల్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అధినేత. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంగా ప్రత్యేకహోదాని చేర్చేశారు కూడా. ఈలోపు జనాన్ని అటెన్షన్ చేయడానికి తన కార్యచరణను ప్రకటించారు. మార్చి 1 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్‌‌ల ముట్టడి.. 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని.. అప్పటికి కేంద్రం దిగి రాకపోతే.. ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.

 

ఈ వేడి ఇంకా చల్లారకముందే నిన్న మరో బాంబు పేల్చారు ప్రతిపక్షనేత.. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని.. అందుకు టీడీపీ సహకరిస్తుందా..? టీడీపీ ఆ పనిచేస్తే.. తాము మద్దతు ఇస్తామంటూ సవాల్ విసిరారు. ఒకవైపు బీజేపీతో పొత్తు ఉంచుకోవాలా..? తెంచుకోవాలా..? అన్న దానిపై క్లారిటీ కోసం ఎదురుచూస్తోన్న చంద్రబాబుకు.. ఇప్పుడు బీజేపీతో పాటు జగన్‌ని కూడా ఏకకాలంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇలాంటి సంక్షోభాలను ఎన్నింటినో చూసి.. తలపండిపోయిన టీడీపీ అధినేతకు ఇదేమంత కష్టమైన పని కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

ఇందుకోసం మొదటగా మార్చి 5వ తేదీనే తన గేమ్ ప్లాన్‌ను అమలు చేయబోతున్నారట ఏపీ ముఖ్యమంత్రి. మార్చి 5వ తేదీ నుంచి చివరి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రానిపక్షంలో.. ఆ రోజే బీజేపీకి తొలి షాక్ ఇవ్వాలనుకుంటున్నారట.. మార్చి 5న టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే.. అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తానికి వైసీపీ కంటే ముందుగానే కేంద్రాన్ని ఒత్తిడిలో పడేసేందుకు చంద్రబాబు తెరవెనుక పావులు కదుపుతున్నారట.