బాబుగారూ.. మీరు ఊ.. అనండి చాలు!

చంద్రబాబు గారూ.. మీరు ఒక్కసారి ‘‘ఊ’’ అనండి.. మేం మా సత్తా చూపిస్తాం.. వాళ్ళని ఒక్క ఆట ఆడుకుని దుమ్ము దులిపేస్తాం... అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసులోనే మథనపడిపోతున్నారు. తమ మనసులో వున్న మాటని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పే సాహసం కూడా వారు చేయలేకపోతున్నారు. ఎందుకంటే... టీడీపీ క్రమశిక్షణ అనే చట్రంలో ఇరుక్కుపోయిన పార్టీ కదా! పార్టీ అధినేత ఆదేశాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడ్డానికి అవకాశమే లేదు. ఎవరి నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తూ వుండాల్సిందే. ఇంతకీ తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క ఆట ఆడుకుని దుమ్ము దులిపేయాలని అనుకుంటున్నది ఎవర్ని? ఇంకెవర్నండీ బాబు.. ఏపీలో నిక్షేపంగా మిత్రద్రోహానికి పాల్పడుతున్న భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలని. అధికారంలో భాగం తీసుకుంటూనే తమమీద నోరు పారేసుకుంటున్న బీజేపీవాళ్ళని.

 

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి పక్కలో బల్లెం మాదిరిగా తయారైంది. కేంద్రంలో మోడీ అండ చూసుకుని బీజేపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సోము వీర్రాజు లాంటి వాళ్ళు మాటలతో వీరంగం వేస్తున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అండతోనే ఎమ్మెల్సీగా అవకాశం పొందిన ఆయన కనీస కృతజ్ఞత కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద కామెంట్లు చేస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే బీజేపీ కేంద్ర నాయకత్వం అండ పుష్కలంగా వున్నట్టు కనిపిస్తోంది. అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సోము వీర్రాజు మీద ఎదురుదాడి చేసే అవకాశం మాత్రం తెలుగుదేశం శ్రేణులకు వుండటం లేదు.

 

వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో వున్నారు కాబట్టి ఎన్ని వ్యాఖ్యలైనా చేస్తారు.. ఎన్ని ఆరోపణలు అయినా చేస్తారు. వాటిని టీడీపీ నాయకులు సమర్థంగానే ఎదుర్కొంటున్నారు. అయితే బీజేపీ విషయంలోనే టీడీపీ కార్యకర్తలకు చేతులు కట్టేసినట్టుగా పరిస్థితి వుంది. స్వపక్షంలోనే వుంటూ తీవ్ర విమర్శలు చేస్తున్న సోము వీర్రాజు వంటి వారి విషయంలో ఎంతమాత్రం స్పందించడానికి వీల్లేదంటూ చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలు టీడీపీ శ్రేణులకు ప్రతిబంధకాలుగా మారాయి. గతంలో ఎన్నో పార్టీల నుంచి వచ్చిన విమర్శలను దీటుగా ఎదుర్కొన్న తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు బీజేపీ విషయంలో మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో వున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డదిడ్డంగా విభజనకు గురి కావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత కారణమో భారతీయ జనతా పార్టీ కూడా అంతే కారణం. ఏపీ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఎంతో, బీజేపీ కూడా అంతే. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ఇప్పుడు అధికారంలో భాగం పంచుకోగలిగారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తమ స్థాయిని ఎక్కువగా అంచనా వేసుకుంటున్న బీజేపీ నాయకులు 2019లో పూర్తి స్థాయి అధికారం గురించి కలలు కంటూ టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం వుందని తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. చంద్రబాబు తమ ముందరి కళ్ళకు బంధాలు వేస్తూ బీజేపీ మరింత రెచ్చిపోయేలా చేస్తున్నారని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు బీజేపీని ఎదుర్కొనే విషయంలో తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. బాబు ‘‘ఊ’’ అంటే చాలు... బీజేపీ సంగతి తేల్చడానికి సిద్ధంగా వున్నారు.