వెంకయ్య రాజీనామా హెచ్చరిక..?

 

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మొండిచేయి చూపడంతో.. అన్ని వర్గాల నుంచి నిరసన స్వరం వినిపిస్తోంది. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, రాష్ట్రంలో అధికారాన్ని చలాయిస్తున్న తెలుగుదేశం పార్టీపై సహజంగానే ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా..? లేక ఎవరి దారి వారు చూసుకుంటారా..? అంటూ ప్రధాన రాజకీయ పక్షాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడటంతో.. పొత్తుకు ఎవరు ముందు చెక్ పెడతారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

 

టీడీపీలోనూ.. బీజేపీలోనూ పొత్తు తెంచుకోవాలని అనుకుంటున్న వర్గాలు.. తమ అధిష్టానాల మీద ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా..? అని ఎదురుచూసిన వారికి టీడీపీ అధినేత మాటలు షాక్ ఇచ్చాయి. పొత్తును తెంచుకోవడం.. కేంద్రప్రభుత్వం నుంచి బయటికి రావడం నిమిషంలో పని.. అయితే రాష్ట్రానికి జరిగిన.. జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్ సాక్షిగా పోరాడాలని.. ప్రజల అసంతృప్తిని కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలని సీఎం.. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. గత రెండు, మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ-బీజేపీ బంధం తెగిపోతుందని అందరూ భావించారు.. కానీ చంద్రబాబు మరోసారి డెడ్‌లైన్ పెట్టడం వెనుక కారణమేమిటీ..? అంటే దానికి వెంకయ్యనాయుడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు.. గుంటూరుకు వచ్చిన వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు కొంతసేపు ఏకాంతంగా చర్చలు జరిపారట. రాష్ట్రానికి బడ్జెట్‌లో జరిగిన అన్యాయంతో పాటు... స్నేహాధర్మాన్ని పాటించకుండా బీజేపీ వ్యవహరిస్తోన్న తీరును ముఖ్యమంత్రి, వెంకయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఇదంతా విన్న ఉపరాష్ట్రపతి.. బాబుకు ధైర్యం చెప్పి.. అప్పటికప్పుడు బీజేపీ అధిష్టానానికి ఫోన్ చేసి.. ఏపీ పరిస్థితిపైనా... టీడీపీతో వ్యవహరిస్తున్న తీరుపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించనని.. అలా జరిగితే తన ఉపరాష్ట్రపతి పదవిని సైతం వదులుకునేందుకు వెనుకాడనని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. 

 

ఇది జరిగిన కాసేపటికే టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఉన్న చంద్రబాబుకు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఫోన్ చేసి.. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయనీ.. తొందరపాటు నిర్ణయాలేవీ వద్దని.. మరోసారి ప్రధానిని కలవాల్సిందిగా చెప్పినట్లు పొలిటికల్ టాక్. వెంకయ్య రాజీనామా హెచ్చరిక కారణంగానే బీజేపీ అధిష్టానం రాజ్‌నాథ్‌తో రాయబారం నడిపిందని.. చంద్రబాబు కూడా చివరిసారిగా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామనే నిర్ణయానికి వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.