జగన్ హయాంలో గ్రూప్ 1 స్కామ్.. అలాంటిది ఎన్నడూ చూడలేదు.. మీడియా చిట్ చాట్ లో చంద్రబాబు.!
Published on: Mon Aug 17, 2026 2:50PM

జగన్ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నియామకాలలో జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ధ్వజమెత్తారు. అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడయాతో చిట్ చాట్ గా మాట్లాడిన చంద్రబాబునాయుడు.. గత పాలకుల స్వార్థ ప్రయోజనాలు, నిబంధనల ఉల్లంఘన కారణంగా వేలాది మంది మెరిట్ విద్యార్థులు అన్యాయానికి బలయ్యారన్నారు.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెలికితీసిన ఆధారాల వివరాలను ప్రజలందరికీ స్పష్టంగా తెలిసేలా శాసనసభ వేదికగా సమగ్రంగా చర్చిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్1 పరీక్షల డిజిటల్, మాన్యువల్ రీ-వ్యాల్యుయేషన్ ప్రక్రియలలో నిబంధనలను పక్కనబెట్టి అక్రమాలకు పాల్పడినట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తు తేల్చిందన్నారు. అర్హులైన నిపుణులైన అధ్యాపకుల చేత కాకుండా కాంట్రాక్ట్ సిబ్బంది, ఇతర అనర్హుల చేత మూల్యాంకనం చేయించడం, ఓఎంఆర్ షీట్ల మార్పిడి వంటి అంశాలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీశాయన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ ద్వారా అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు ఎంపికయ్యారని, వారికి ఈ నియామక ప్రక్రియతో ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉందన్నారు. తమ ఆత్మగౌరవాన్ని, అర్హతను కాపాడుకునేందుకే వారు రోడ్లపైకి వచ్చి మద్దతు తెలపాల్సి వచ్చిందని సీఎం వివరించారు.
గత పాలకులు ప్రభుత్వ వ్యవస్థలను, నియామక బోర్డులను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ అధికారాలను సైతం పక్కనబెట్టి అర్హత లేని వారికి ఎక్కువ మార్కులు వేసేలా అక్రమాలకు పాల్పడ్డారని విచారణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్న చంద్రబాబు.. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగ నియామక వ్యవస్థపై నిరుద్యోగ యువత నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన అన్ని అక్రమాలపై పారదర్శకమైన విచారణ జరిపి దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉందని ఉద్ఢాటించిన చంద్రబాబు.. నిరుద్యోగ యువతకు న్యాయం చేయడంతో పాటు అర్హులకే ఉద్యోగాలు దక్కేలా రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని పేర్కొన్నారు.
Chandrababu Naidu, AP AssemblyLobby, MediaChit Chat, YCP Group 1 Scam, APPSC Group 1 Evaluation Scam, AP Mega DSC


