ఫలిస్తున్న బాబు బుజ్జగింపులు, ఆగిన వలసలు!
Published on: Wed Jun 6, 2012 12:13PM
తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాసయాదవ్ తన మనస్సు మార్చుకుని టిడిపిలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. సిబిఐ వై.కా.పా. అధినేత జగన్ ను అరెస్టు చేశాక ఇటీవల కాలంలో రాజకీయ వలసల గురించే చర్చ రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం తన పార్టీలోని ఏ ఒక్కరినీ వదులుకోకుడదని నేతలను బుజ్జగించటమే ప్రధానపనిగా పెట్టుకున్నారు. ఒకవైపు ఉప ఎన్నికల ప్రచారం ఆపకుండానే మరోవైపు తమ పార్టీ నుంచి వలసలకు ఆయాన బ్రేక్ వేస్తున్నారు. ముందు వై.కా.పా.కు అనుకూలంగా ప్రకటన చేసిన తలసాని ఆ తరువాత కాంగ్రెస్ వైపు చూశారు. ఆ రెండు పార్టీలూ ఆహ్వానించలేదో, చంద్రబాబు బుజ్జగింపు పనిచేసిందో కానీ, శ్రీనివాసయాదవ్ తెలుగుదేశంలోనే కొనసాగుతామన్నారు. తమ నాయకుడు చంద్రబాబు మంచి దక్షత ఉన్నవాడని, ఆయన దగ్గర ఉంటే ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవచ్చని తలసాని కితాబిచ్చారంటే బాబు బుజ్జగింపు ఎంతలా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.


