TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఖమ్మం పరిణామాలపై బాబు కలవరం

Published on: Mon May 7, 2012 9:56AM

ఖమ్మం జిల్లా తెలుగుదేశంపార్టీలో చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాల పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలవరపడుతున్నట్లు తెలిసింది. ఈ జిల్లాలో పార్టీ తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు వర్గాలుగా విడిపోయి పరస్పరం కలహించుకుంటున్నాయి. వీరి కార్యకలాపాలకు భయపడి చంద్రబాబునాయుడు పార్టీ సంస్థాగత ఎన్నికలను కూడా వాయిదా వేయాల్సి వస్తోంది. ఎన్నికల వాయిదాకు తుమ్మల నాగేశ్వరరావు కారణం అంటూ నామా వర్గీయులు పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేయబోయారు.

 

 

ఇది తెలుసుకున్న తుమ్మల వర్గీయులు ముందుగానే పార్టీకార్యాలయానికి తాళం వేసి ఉడాయించారు. పార్టీ పరువు బజారున పడటంతో చంద్రబాబునాయుడు ఈ ఇద్దరు నాయకులతో టెలిఫోనులో సంభాషించినట్లు తెలిసింది. తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో సీనియర్ నాయకుడే కాకుండా రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. నామా నాగేశ్వరరావు సంపన్నవర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం పార్లమెంటు సభ్యునిగా కూడా ఉన్నారు. వీరిద్దరూ బలమైన నాయకులే కావటంతో వారిని నియంత్రించటం చంద్రబాబు నాయుడికి కష్టంగా మారింది. ఈ నిస్సహాయ పరిస్థితుల్లోనే చంద్రబాబునాయుడు పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేశారు.