పండక్కూడా రైతన్న పస్తులే:చంద్రబాబు
Published on: Sun Jan 15, 2012 11:55AM
తిరుపతి:కాంగ్రెస్ విధానాల వల్లే రైతులు సంక్రాంతి పండక్కూడా పస్తులు ఉండాల్సి వచ్చిందని తిరుపతి పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు అన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, నీట మునిగిందన్నారు. పదిహేను రోజుల క్రితం చేతికి అందిన పంట వర్షాల్లో కొట్టుకుపోయిందని చెప్పారు.వ్యాట్ పేరుతో అన్ని వస్తువులపై నాలుగు శాతం పన్నువేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తెలంగాణా, కోస్తాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఈసారి ఆశించిన మేర వర్షాలు పడలేదని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు.ఈనెల 19వ తేదీ చిత్తూరు జిల్లాలో రైతు పోరుయాత్రను నిర్వహిస్తామని తెలిపారు.


