ఒక పరాజయం 100 తప్పులు.. ఆ 'కులమే' కొంప ముంచిందా..?

 

'కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు' అన్నట్టుగా ఏపీలో టీడీపీ ఘోర పరాజయానికి నూరు కారణాలు ఉన్నాయి. నూరు కారణాలు అనడం కంటే 'చంద్రబాబు నూరు తప్పులు' అనడం కరెక్టేమో. ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం టీడీపీకి కర్త, కర్మ, క్రియ అన్నీ బాబే. అన్నీ తానే అనుకునే బాబు చేసిన తప్పులు పుణ్యమా అనే టీడీపీకి ఇన్ని తిప్పలు వచ్చాయి.

ఏపీలో కుల రాజకీయాలు జరుగుతుంటాయి. కానీ బాబు కుల సమీకరణలు చేయడంలో విఫలమయ్యారు. అంతేకాదు మొదటి నుండి పార్టీకి అండగా ఉన్న కులాలను సైతం దూరం చేసుకున్నారు. ఆయనకు తోడు సీనియర్లు సైతం వారి వారి కులాలను ఆకర్శించడంలో విఫలమయ్యారు. 

టీడీపీలో పార్టీలో నెంబర్ 2 గా ఉన్న యనమల రామకృష్ణుడు తన సామాజికవర్గమైన యాదవ కులాన్ని ఏమన్నా ఆకర్షించగలిగారా? అస్సలు లేదు. కొల్లు రవి మత్స్యకారి వర్గానికి చెందిన నేత. మరి ఆయన వారిని ఆకర్షించే ప్రయత్నం చేసారా? లేదు. కమ్మ సామజికవర్గానికి చెందిన దేవినేని ఉమా మంత్రిగా చేసారు. కృష్ణ జిల్లాలో కమ్మ వారు దాదాపు సగం మంది టీడీపీకి దూరమయ్యారు. వారిని ఆకర్షించడంలో ఉమా విఫలమయ్యారు. ఎంత సేపూ నేతలు స్వలాభం కోసం కాంట్రాక్టర్లు, దళారులతో సత్సంబంధాలు కొనసాగించడమే తప్ప.. వారి వారి సామజికవర్గాన్ని ఆకర్షించలేకపోయారు. అసలు మంత్రులు అనేవాళ్ళు కనీసం ఓ జిల్లాని శాసించేలా ఉండాలి. కులాల ఓట్లు అనే కాదు, సాధారణ ప్రజలకు కూడా దగ్గరై జిల్లాలో పార్టీ గెలుపుకి కృషి చేయాలి. కానీ మంత్రులు సొంత నియోజకవర్గంలో గెలవలేక చతికిలపడ్డారు.

ఇక టీడీపీకి ప్రధాన బలమైన బీసీలను బాబు దూరం చేసుకున్నాడు. కాపులకి దగ్గరవ్వాలని కాపు కార్పొరేషన్ పెట్టాడు. కాపులు దగ్గరవ్వకపోగా, 1983 నుంచి పార్టీకి బలం అనుకున్న బీసీలు దూరమయ్యారు. వారికి టికెట్ల పరంగానో, వేరే విధంగానే భరోసా ఇచ్చి వారిని పార్టీ నుండి దూరం కాకుండా చేసుకోలేకపోయారు. బ్రాహ్మణులకు దగ్గరవుదామని బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాడు. కానీ వారి ఓట్లు మాత్రం గెలుచుకోలేకపోయాడు.

అదేవిధంగా టీడీపీకి కమ్మ సామాజికవర్గం అండగా ఉంటుంది అంటారు. కానీ కమ్మ సామాజిక వర్గ నేతలు, కమ్మ యువతే టీడీపీ కొంపముంచారు. టీడీపీ ఘోర ఓటమికి కారణమయ్యారు.