చంద్రబాబు వ్యూహం… బీజేపీకి దూరంగా... మైనార్టీలకు దగ్గరగా!

మైనార్టీలు… భారతదేశంలో ఈ పదం చాలా పవర్ ఫుల్! ప్రజాస్వామ్య రాజకీయాల్లో మైనార్టీల ఓట్లు అత్యంత కీలకం. ఇక మన దేశంలో అయితే మరింత ముఖ్యం. ఎందుకంటే, మన దగ్గర చాలా నియోజక వర్గాల్లో మైనార్టీ ఓట్లు గెలుపోటముల్ని నిర్ణయించేస్తుంటాయి. అందుకే, అన్ని పార్టీలు ముస్లిమ్ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూనే వుంటాయి. అవసరం అనుకున్న చోట్ల క్రిస్టయన్ మైనార్టీ ఓట్లను కూడా తమ స్వంతం చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంటాయి. అయితే, కేవలం బీజేపీకి మాత్రం మైనార్టీలతో రివర్స్ రిలేషన్ షిప్ నడుస్తుంటుంది. ఆ పార్టీ హిందూత్వ ఎజెండాతో నడవటం వల్ల మైనార్టీలు సహజంగానే కాషాయానికి కాస్త దూరంగా వుంటూ వుంటారు. దక్షిణాదిలో అయితే అసలే బలహీనమైన బీజేపీకి మైనార్టీల మద్దతు మరీ కరువు. అయితే, బీజేపీ పట్ల వుండే వ్యతిరేక భావం అప్పుడప్పుడూ దానితో దగ్గరగా వుండే పార్టీల పట్ల కూడా మైనార్టీలు చూపుతుంటారు. అదే పెద్ద ప్రమాదంగా భావిస్తుంటారు తమని తాము సెక్యులర్ నేతలుగా చెప్పుకునే పార్టీల వారు!

 

 

గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారికంగా కమలంతో పొత్తు పెట్టుకున్నారు. అయినా మైనార్టీలు విపరీతంగా ఏం రియాక్ట్ కాలేదు. జగన్ కు బదులు బాబునే నవ్యాంధ్ర సీఎంగా ఎంచుకున్నారు. అందుక్కారణాలు అనేకం. చంద్రబాబు గతంలోనూ ఎన్డీఏలో కీలక నేతగా వ్యవహరించారు. మోదీ లాంటి హిందూత్వవాదిని ఆయన సమర్థించినా… వ్యక్తిగతంగా బాబులోని సెక్యులర్ విలువలు గత నలబై ఏళ్లుగా ఏపీ మైనార్టీలకు తెలుసు. ఇలాంటి కారణాల వల్ల ముస్లిమ్ ఓటర్లు టీడీపీని బాగానే ఆదరించారు. అయితే, ఇప్పుడు టీడీపీ పూర్తిగా ఎన్డీఏ నుంచీ బయటకు వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో స్వంతంగా పోటీ చేయబోతోంది. అదే సమయంలో జగన్ అంతకంతకూ కాషాయ శక్తులకు దగ్గరవుతున్నారు. అధికారికంగా పొత్తు లేకున్నా మోదీ చెప్పినట్లు జగన్ చేస్తున్నాడని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దాన్ని గట్టిగా స్పందించే స్థితిలో కూడా వైసీపీ లేదు!

 

 

సుదర్ఘీమైన రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి సరికొత్తగా ముస్లిమ్ ఓటర్ల వర్గంలో భరోసా నింపే ప్రయత్నంలో వున్నట్టు కనిపిస్తోంది. మైనార్టీలు జగన్ ను పూర్తిగా నమ్మే స్థితిలో లేరు. ఆయన బీజేపీతో రహస్య అనుబంధం కొనసాగిస్తుండటమే అందుకు కారణం. మరోవైపు, పవన్ పట్ల కూడా వారికి ప్రత్యేక ప్రేమగానీ, అయిష్టంగానీ లేవు. అలాగని … అనుభవంలో జగన్ కంటే కూడా తక్కువ స్థాయిలో వున్న జనసేనానికి ఎలా ఓటు వేస్తారు? మొత్తంగా చూస్తే తెలంగాణలో వున్నట్టు ఎంఐఎం పార్టీ లాంటి ప్రత్యేక మైనార్టీ నాయకత్వపు పార్టీ ఇక్కడ లేదు కాబట్టి… వారు టీడీపీనే ఎంచుకోవాల్సి వచ్చేలా వుంది. అందుకు తగ్గట్టే గత నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు ముస్లిమ్ మైనార్టీలకు వీలైనన్ని వరాలు కురిపిస్తున్న చంద్రబాబు మరో ముందడుగు వేయబోతున్నారట!  

 

ఈ నెల 28న గుంటూరులో మైనార్టీలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. నారా హమారా నినాదాలు మిన్నంటనున్నాయి! అయితే, సభకు ప్రత్యేకంగా హాజరు కానున్న చంద్రబాబు అంతలోపే వారికి చక్కటి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. త్వరలో మంత్రి వర్గ విస్తరణ వుంటుందని చెబుతోన్న టీడీపీ వర్గాలు ఒక టీడీపీ ముస్లిమ్ నేత మినిస్టర్ అవుతారని చెబుతున్నారు. ఆ నాయకుడు ఎవరు? చాంద్ పాషానా, షరీఫా, మరొకరా, ఇంకొకరా… ఇప్పుడే మనకు తెలియదు. కానీ, బీజేపీతో పొత్తు ఇప్పుడు లేదు కనక ఆ పార్టీ నాయకులు కామినేని, మాణిక్యాల రావులు ఖాళీ చేసిన శాఖలు చంద్రబాబు పూరించనున్నారు. ఆ రెండిట్లో ఒకటిగానీ, మరేదైనా శాఖగానీ మైనార్టీ నేతకు కట్టబెట్టవచ్చట. మంత్రి వర్గ విస్తరణలో మార్పులు భారీగా వుంటాయా, లేదా కేవలం చిన్న చిన్న మార్పులే చేస్తారా ఇంకా తెలియదు. కానీ, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలబడతామని అంటోన్న మైనార్టీలకు మాత్రం చంద్రబాబు కేబినేట్లో సముచిత స్థానం కల్పించనున్నారట!

 

 

పాదయాత్రల పేరుతో కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతోన్న జగన్, పవన్ ఈ తాజా పరిణామంతో కాస్త ఆందోళన చెందుతారనటంలో సందేహం లేదు. ఒకవైపు వైసీపీని, జనసేనని బీజేపీ అనుబంధ పార్టీలుగా ప్రచారం చేస్తోన్న టీడీపీ… ఇప్పుడు మైనార్టీల్ని దగ్గర చేసుకునే విధంగా మినిస్టర్ పోస్ట్ ఇస్తే మాత్రం… అది ఖచ్చితంగా ఎన్నికల సమయంలో నష్టమే. మైనార్టీలుగా గంప గుత్తగా జగన్, పవన్ లను కాదని చంద్రబాబు వెంట నిలిస్తే చాలా సీట్లలో విజయాలు తారుమారు అయిపోవచ్చు! చూడాలి మరి … అపార అనుభవం వున్న చంద్రబాబును ఢీకొడుతోన్న యువ నేతలు జగన్, పవన్ మైనార్టీ ఓటు బ్యాంక్ వ్యూహాన్ని ఎలా ఛేదిస్తారో!