TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ బాటలో బాబు.. ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో ఒప్పందం!!

Published on: Fri Jun 14, 2019 4:28PM

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా జరిగిన టీడీపీ వర్క్ షాప్ సమీక్షా సమావేశం సందర్భంగా పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోవాలని టీడీపీ నేతలకు సూచించిన చంద్రబాబు.. మళ్లీ పార్టీని గెలిపించుకోవడం ఎలా అనే దానిపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల్లో వైసీపీ విజయానికి కీలకంగా భావించే నవరత్నాల పథకాల రూపకల్పన చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్.. జగన్ పాదయాత్ర, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక సహా అనేక అంశాల్లో కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు వైసీపీకి ప్రశాంత్ కిశోర్ టీమ్‌కు ఉన్న కాంట్రాక్ట్ ముగిసిందని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు అప్పుడే ప్రశాంత్ కిశోర్ టీమ్ తో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్. కొందరు టీడీపీ ముఖ్యనేతలు సైతం ఈ మేరకు చంద్రబాబుకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.