బీజేపీ వారు శాసిస్తారు....జగన్ పాటిస్తాడు ?

 

మరో రెండేళ్ళలో చంద్రబాబు జైలుకు వెళతారట, ఈ మాట చెప్పింది ఎవరో కాదు బీజేపీకి ఏపీ ఇంచార్జ్ గా నియమించబడిన దేవధర్ అనే బీజేపీ నేత. ఆయన నిన్న ఆ పార్టీ మహిళా నాయకురాలు చంద్రబాబుకు బంధువు అయిన పురందేశ్వరితో కలిసి ఎన్టీఆర్ జన్మ స్థలం అయిన పామర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన పేదల సంక్షేమం కోసం తెలుగుదేశాన్ని స్థాపించి 9 నెలలలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. తన రాజకీయ వారసుడిగా లోకేశ్ ను చంద్రబాబు ప్రకటించడం దారుణమని అన్నారు ఆయన.

ఆయన అలా వ్యాఖ్యానించారో లేదో మరో పక్క గత ప్రభుత్వ అవినీతి మీద జగన్ ఒక కమిటీ నియమించారు. ఈరోజు ఏపీ విద్యుత్, ఇంధన శాఖ అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన అక్రమాల మీద దృష్టి సారించిన జగన్ సోలార్, విండ్ పవర్ కొనుగోళ్ల విషయంలో బిడ్డింగ్ రేట్లు కన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని సీరియస్ అయ్యారట. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ నష్టాన్ని రికవరీ చేయాలి జగన్ ఆదేశించారు. ఆయా విద్యుత్ సంస్థలతో తిరిగి సంప్రదింపులు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు, సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వాటితో ఉన్న ఒప్పందాలు రద్దు చేస్తున్నట్టు జగన్ ఆదేశించారు. ఈ ఒప్పందాల్లో భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరినట్టు తెలియడంతో అప్పట్లో ఈ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి సీఎం, మంత్రిపైనా న్యాయపరమైన చర్యలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు.

అంటే అదేదో సినిమాలో ఆ దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అన్నట్టు బీజేపీ నేతలు సిగ్నల్ ఇస్తారు, జగన్ ఉచ్చు బిగిస్తారు అన్నమాట. నిజానికి చంద్రబాబు మీద అసలు కేసులే లేవని ఆయనను ఇబ్బంది పెట్టె అవసరం ఎవరికి ఉంటుందని నిన్ననే తాజగా పార్టీ ఫిరాయించిన సుజనా ప్రశ్నించారు. తమను చంద్రబాబే పార్టీ మారేలా ప్రోత్సహించి కేసుల నుండి బయట పడే ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న విమర్శల నేపధ్యంలో ఆయన అలా స్పందించారు. కేసులు లేకపోతే రెండేళ్ళలో జైల్లో వేయడం ఎలాగని అనుకున్నారో ఏమో తెల్లారే సరికి కేసులు నమోదు చేసే సౌలభ్యాన్ని కలిగించారు.