TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

యూపీయే ఛైర్మ‌న్‌ గా చంద్రబాబు.. మహాకూటమి మాస్టర్ ప్లాన్

Published on: Fri May 10, 2019 2:49PM

 

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ నెల 23న వెలువ‌డ‌నున్నాయి. ఎన్‌డీయే అధికారంలోకి వ‌స్తే మోదీ మళ్ళీ ప్ర‌ధాని కావ‌డం ఖాయం. ఒకవేళ యూపీఏ అధికారంలోకి వ‌స్తే ఎవ‌రు ప్ర‌ధాని అవుతార‌న్న‌దే అసలు ప్రశ్న. కాంగ్రెస్ కి పూర్తి మెజార్టీ వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. కానీ కాంగ్రెస్ కి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితే వస్తే ఏం చేయాలనేదానిపై కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు సీరియస్ గా ఆలోచిస్తున్నాయి. దీనికి ఈ నెల 21న జ‌రిగే బీజేపీయేత‌ర ప‌క్షాల స‌మావేశంలో ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

బీజేపీయేత‌ర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. బీజేపీయేత‌ర ఫ్రంట్‌లో కాంగ్రెస్ పెద్ద‌న్న పాత్ర పోషించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ, ప్రాంతీయ పార్టీలే కీల‌కం కానున్నాయి. దీంతో ఇప్పుడు బీజేపీయేత‌ర ఫ్రంట్‌కు ఎవరు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కాంగ్రెస్ ఉండ‌టం వల్ల ఈ ఫ్రంట్‌ను ప్ర‌స్తుతం యూపీఏగా అభివ‌ర్ణిస్తున్నారు. యూపీయేకు ప్ర‌స్తుతం ఛైర్‌ప‌ర్స‌న్‌గా సోనియాగాంధీ ఉన్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఆమె యూపీయే ఛైర్‌ప‌ర్స‌న్‌గా కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం వ‌యోభారం, అనారోగ్యం కార‌ణంగా ఫ్రంట్ కార్య‌కలాపాల్లో ఎక్కువ‌గా పాల్గొన‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లో యూపీయేకు కొత్త ఛైర్మ‌న్ ఎన్నుకోవాల‌ని భాగ‌స్వామ్య ప‌క్షాలు ప్ర‌తిపాదిస్తున్నాయి.

యూపీయే కొత్త ఛైర్మ‌న్‌గా చంద్ర‌బాబును ఎన్నుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్సు నేత ఫ‌రూక్ అబ్దుల్లా, ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్‌ప‌వార్‌, పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త‌బెన‌ర్జీ ప్ర‌తిపాదిస్తున్నారు. దీనికి ఆప్ అధినేత కేజ్రీవాల్‌, వామ‌ప‌క్షాలు, ఎస్పీ, బీఎస్పీలు కూడా మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ కాంగ్రెస్ సార‌థ్య బాధ్య‌త‌లు తీసుకుంటే.. ఎస్పీ, బీఎస్పీ, ఆప్‌, వామ‌ప‌క్షాలు యూపీయేలో చేరేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌చ్చ‌ని చ‌ర్చ న‌డుస్తోంది. కేవ‌లం బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు ఇవ్వొచ్చు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వం ఏర్ప‌డితే అది ఎప్పుడు కూలిపోతుందో తెలియ‌దు. దీనికి మ‌ధ్యేమార్గంగా చంద్ర‌బాబును యూపీయే ఛైర్మ‌న్‌గా చేయాల‌ని ఫ్రంట్‌లో చ‌ర్చ న‌డుస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలోనూ యునైటెడ్ ఫ్రంట్ క‌న్వీన‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వం చంద్ర‌బాబుకు ఉంది. ఈ దృష్ట్యా ఆయ‌న పేరును తెర‌పైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది.