ఏపీలో 2700 ఎకరాల్లో అతిపెద్ద ఎయిర్‌పోర్టు!!

 

విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. దిబ్బవలస సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోనే తొలి తీరప్రాంత విమానాశ్రయంగా భోగాపురం గుర్తింపు పొందనుంది. ఇక్కడ ప్రపంచంలోనే పెద్ద విమానమైన ఎ.380 దిగేలా 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఏర్పాటు కానుంది. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ నుంచి 97.73శాతం ట్రాఫిక్‌ ఉండే అవకాశముందని భారత విమానాశ్రయాల సంస్థ సర్వేలో తేలింది. దీన్ని బట్టి భవిష్యత్తులో రాష్ట్రానికి భోగాపురం ఎయిర్‌పోర్టు ఎంతో కీలకం కానుంది.

విశాఖ ఎయిర్‌పోర్టు విమానాల పార్కింగుకు తగిన సదుపాయాలు, హ్యాంగర్లు లేవు. వచ్చిన విమానం వచ్చినట్లే తిరిగి వెళ్తున్నాయి. నిర్వహణ పనులు, తనిఖీలు మరమ్మతులకు వర్క్‌షాపు అవసరం. భవిష్యత్తు అవసరాలకు ఏమాత్రం సరిపోదు. అందుకే ప్రయాణికుల చేరవేతతో పాటు సరకు రవాణా, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా భోగాపురం విమానాశ్రయానికి బీజం పడింది. ఇక్కడ విశాలమైన ప్రదేశంలో అన్ని హంగులతో కార్యరూపం దాల్చేందుకు ఇప్పటికే అంతా సిద్ధమైంది. ఈ ప్రాంతంలో ఎయిరో సిటీ, విలాసవంతమైన 5 స్టార్ హోటళ్లు, విమానాల పార్కింగు, నివాస గృహలు, వాణిజ్య సముదాయాలు తదితర వసతులు అందుబాటులోకి రానున్నాయి. విమాన నిర్వహణ సముదాయం, విడిభాగాల తయారీ పరిశ్రమల ఏర్పాటుతో వైమానిక హబ్‌గా రూపుదిద్దుకోనుంది. రానున్న రోజుల్లో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది నిపుణుల అంచనా.

భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రగతికి చిహ్నంగా ఉంటుందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా.. భోగాపురం నుంచి వెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు. 2700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నామన్నారు. ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్‌రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప, రాజమండ్రి, విజయవాడ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాలు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. మూడు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు ఉన్న రాష్ట్రం మనదేనని చెప్పారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా.. భోగాపురం విమానాశ్రయంతో పాటు పలు కార్యక్రమాలకు చంద్రబాబు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. కొత్తవలసలో రూ.600 కోట్లతో ఏర్పాటు చేసే పతంజలి ఫుడ్‌ హెర్బల్‌ కేంద్రానికి, గజపతినగరంలో రూ.50 కోట్లతో ఏర్పాటు చేయనున్న చందన ఫుడ్‌ యూనిట్‌కు, ఎల్‌.కోటలో నిర్మించే ఆరోగ్య మిల్లెట్‌ యూనిట్‌కు, విజయనగరంలో వైద్యకళాశాల, డిగ్రీకళాశాల, గురజాడ వర్సిటీకి చంద్రబాబు శంకుస్థాపన చేసారు.