TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు 44.. జగన్ ఇచ్చేదెంత? పీఆర్సీపై ఉద్యోగుల్లో ఉత్కంఠ..

Published on: Wed Dec 15, 2021 1:58PM

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ  రగడ ముదురుతోంది. పీఆర్సీ కమిషన్ 27 శాతం ఫిట్ మెంట్ సిఫారస్ చేయగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎస్ కమిటి మాత్రం కేవలం 14.29 శాతం సిఫారస్ చేసింది. 14.29  ఫిట్‌మెంట్ ఇచ్చినా ప్రభుత్వంపై రూ. 4వేల కోట్ల అదనపుభారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ సంఘాలు మాత్రం తమకు 30 శాతానికి పైగానా పీఆర్సీ ఇవ్వాల్సిందేనని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుదన్నది ఆసక్తిగా మారింది. చివరి సారి ఉద్యోగులకు 44 శాతం పీఆర్సీ ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పడు ఉద్యోగులంతా చంద్రబాబును గుర్తు చేసుకుంటూ.. జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు పీఆర్సీ అంటే ఏంటీ? గతంలో ఎవరు ఎంత పీఆర్సీ ఇచ్చారో చూద్దాం.. 

పీఆర్‌సీ అంటే పే రివిజన్ కమిషన్. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం ఇవ్వాలి? ఎంత భత్యం ఇవ్వాలి వంటివి సిఫార్సు చేసే కమిటి. ప్రతి అయిదేళ్లకోసారి ఈ సంఘాన్ని నియమిస్తారు. ఈ సంఘం ఇచ్చే సిఫార్సును విని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా జీతాలు పెంచడమే ఉంటుంది. పీఆర్‌సీ చెప్పిన దానికంటే కాస్త ఎక్కువే జీతాలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది.కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి కమిటీని పే కమిషన్ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో పే రివిజన్ కమిషన్ అంటారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ప్రకటించిన పీఆర్సీ వివరాలు చూస్తే..

1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం పీఆర్సీ ప్రకటించింది. ఇది అప్పట్లో  సంచలనం. తర్వాత 1993లో కాంగ్రెస్ సీఎంగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కార్ కూడా ఎన్టీఆర్ తరహాలోనే 10 శాతం పీఆర్సీ ఇచ్చింది. 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 25 శాతం పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఇది అప్పట్లో ఉద్యోగులు ఊహించినదాని కంటే ఎక్కువ. 

చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్ ప్రభుత్వం 2005లో ఉద్యోగులకు పీఆర్సీ  ఇచ్చింది. అయితే అది కేవలం 16 శాతమే. అంతకుముందు 1999లో చంద్రబాబు సర్కార్ 25 శాతం ఇవ్వగా.. వైఎస్సార్ కేవలం 16 శాతం పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందారు. వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన రోశయ్య సర్కార్ 2010లో ఉద్యోగులకు 39 శాతం పీఆర్సీ ప్రకటించింది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా సాగుతుండటంతో.. ఉద్యోగులను కూల్ చేయడానికి రోశయ్య సర్కార్ 39 శాతం పీఆర్సీ ఇచ్చిందనే చర్చ జరిగింది.

2014లో రాష్ట్ర విభజన తర్వాత 2015లో రెండు తెలుగు రాష్ట్రాలు పీఆర్సీ ప్రకటించాయి. అయితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యోగులు భారీగా పీఆర్సీ డిమాండ్ చేశారు. దీంతో కేసీఆర్ సర్కార్ ఏకంగా 43 శాతం పీఆర్సీ ప్రకటించింది. ఉద్యోగులకు స్వరాష్ట్రం కానుకగా అభివర్ణించింది. విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారడంతో ఉద్యోగులకు ఇచ్చిన  పీఆర్సీ పెద్ద ఆశ్చర్యం కల్గించలేదు. కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలంగాణకు ధీటుగా.. కాదు వాళ్ల కంటే ఎక్కువగానే 44 శాతం పీఆర్సీ ఇచ్చారు. ఏపీలో లోటు బడ్జెట్ లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు 44 శాతం పీఆర్సీ ప్రకటించారు చంద్రబాబు. విభజనతో కష్టాల్లో పడిన ఏపీ అభివృద్ధికి ఉద్యోగులు పాత్ర కీలకమని భావించడం వల్లే చంద్రబాబు ఎక్కువ పీఆర్సీ ఇచ్చారని భావించారు. చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో ఇదే విషయం చెప్పారు. ఏపీ పాలనలో ఇది కనిపించింది కూడా.