చంద్రబాబు వ్యూహం.. టీడీపీ గెలుపు ఖాయం

తెలంగాణలో ముందస్తు వేడి మొదలైంది కానీ ఏపీలో ఆ ఊసే లేదు.. అయినా ఏపీలో కూడా అప్పుడే ఎన్నికల సెగ మొదలైంది.. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే అభ్యర్థుల వేట మొదలైంది.. అదే విధంగా ప్రజల్లోకి వెళ్లే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి.. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ప్రజల్లోకి వెళ్తూ మళ్ళీ అధికారం చేపట్టే దిశగా దూసుకువెళ్తుంది.. రోజంతా అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే చంద్రబాబు క్రమక్రమంగా రాజకీయ వేడి పెంచుతున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో సమీక్షలకు సమయం పెంచుతూ వస్తున్నారు.. పార్టీ నేతలు, అధికార వర్గాలతో సమావేశమవుతూ ప్రజల నాడి తెలుసుకుంటున్నారు.. లోటుపాట్లు ఎక్కడున్నాయి? వాటిని ఎలా సరిదిద్దాలి? ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే కోణంలో దృష్టి పెట్టారు.

 

 

క్రింది స్థాయిలో బూత్ కమిటీలు మొదలుకొని, పై స్థాయిలో తనవరకు అందరూ ప్రజల మధ్య ఉండేలా చేసుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చన్న అంచనాతో పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెంచారు.. గతంలో అరగంట, గంటతో సరిపెట్టే రాజకీయ సమీక్షలను ఇప్పుడు రెండు మూడు గంటలు నిర్వహిస్తున్నారు.. అదే విధంగా వారంలో రెండు రోజులు జిల్లాల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామదర్శిని అమలు చేస్తున్నారు.. పార్టీపరంగా ఓ వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలుసుకొని వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.. సమస్యలు గుర్తించి వాటికి పరిష్కారం చూపుతున్నారు.. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి రెండు రోజులు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.. నేతలు, అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయటం వల్ల ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

 

 

గ్రామదర్శినిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.. ఒక్కోవారం రెండు నియోజకవర్గాలు ఎంపిక చేసుకొని అక్కడ ప్రజలను కలుస్తున్నారు.. ఎక్కడైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామదర్శినిలో చురుకుగా పాల్గొనడంలేదని సమాచారం అందితే నేరుగా చంద్రబాబు లైన్ లోకి వస్తున్నారు.. వర్గాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తోంది.. ఇప్పటికే 'దళిత తేజం', 'నారా హమారా- టీడీపీ హమారా' పేరిట రెండు సభలు ఏర్పాటు చేసారు.. త్వరలో గిరిజన గర్జన పేరుతో మరో సభ కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.. తద్వారా ఆయా వర్గాల వారిని సమీకరించే కృషిలో పార్టీ నేతలు భాగస్వాములవుతారని, ఈ కార్యక్రమాలు, పథకాలు టీడీపీ అమలుచేస్తుందన్న ముద్ర వస్తుందని భావిస్తున్నారు.. అలాగే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపటానికి ప్రతిజిల్లాలో ధర్మ పోరాట సభలు నిర్వహిస్తున్నారు.

 

 

అదేవిధంగా కింది స్థాయిలో ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయటానికి ప్రభుత్వం కొత్తగా సాధికార మిత్ర వ్యవస్థను రూపొందించింది.. అలాగే బూత్ స్థాయిలో టీడీపీ కార్యకర్తలను కూడా ఎన్నికల మూడ్ లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.. పార్టీ బూత్ లో కన్వీనర్లను నియమించి శిక్షణ ఇస్తున్నారు.. మొత్తానికి చంద్రబాబు పూర్తిస్థాయిలో ఎన్నికల వ్యూహ రచనలోకి వచ్చేసారు.. ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు చూస్తూనే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.. మళ్ళీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.