సోనియా గాంధీ హెచ్చరించాకే జగన్ వెనక్కి తగ్గారు

 

టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి, అరాచకానికి మధ్య జరిగే ఎన్నికలని. రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. చిన్నాన్ననే కొట్టాడని జగన్‌పై మీడియాలో వార్తలు వచ్చాయని.. ఎంపీగా రాజీనామా చేయాలని గతంలో బెదిరిస్తే సోనియా గాంధీ హెచ్చరించాకే వెనక్కు తగ్గారని వచ్చిన కథనాలను ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు చిన్నాన్న హత్యనే గుండెపోటుగా పక్కదారి పట్టించాడని మండిపడ్డారు. సొంత ఛానల్లోనే గుండెనొప్పి డ్రామాను నడిపించారన్న చంద్రబాబు.. హత్య అని బయటపడ్డాకే జగన్ నాటకం మారిందని దుయ్యబట్టారు. సిట్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్న ఆయన దోషులను వదిలేది లేదని తేల్చి చెప్పారు.

వైసీపీకి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టులో కేసు వేసిందని, అలాంటి వాళ్లతో జగన్ అంటకాగుతూ రాష్ట్రంలో ఓటు అడుగుతున్నాడని ధ్వజమెత్తారు. పోలవరం పూర్తిచేసే టీడీపీ కావాలా.? కేసులు వేసే వైసీపీ కావాలా?, రాజధాని నిర్మించే టీడీపీ కావాలా.? అరటితోటలు తగులబెట్టే వైసీపీ కావాలా?, సీమకు నీళ్లిచ్చే టీడీపీ కావాలా? ఫ్యాక్షన్ రెచ్చగొట్టి ప్రాణాలు తీసే వైసీపీ కావాలో? ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా వ్యతిరేకులతో అంటకాగే పార్టీకి ప్రజలే బుద్దిచెప్పాలని కోరారు.
 
ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి ఊహించని ఆధిక్యతలు రాబోతున్నాయన్నారు. అలెగ్జాండర్‌కు 10 లక్షల సైన్యం ఉండేదని, తన సైన్యంలో ప్రతి ఒక్కరూ అలెగ్జాండరే అనే వారని గుర్తుచేశారు. అందుకే అలెగ్జాండర్ ప్రపంచాన్నే గెలిచాడని తెలిపారు. అలాగే టీడీపీకి  65లక్షల సైన్యం ఉందని పేర్కొన్నారు. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తారని స్పష్టంచేశారు. రోజురోజుకూ టీడీపీకి మద్దతుదారులు పెరుగుతున్నారని వెల్లడించారు. 65లక్షల పసుపు సైన్యానికి తోడుగా కోటి మంది అక్కాచెల్లెళ్ల అండ మనకు ఉందని, రైతులు, పింఛనర్లు, యువత, డ్రైవర్ల అండతో 2019 ఎన్నికలు ఏకపక్షం కానున్నాయని ధీమా వ్యక్తం చేశారు.