అవినీతి గొంగళిపురుగుతో స్నేహం తెలంగాణ కోసమేనా?

 

ఎలక్షన్‌ మిషన్‌ 2019పై టీడీపీ నేతలతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 'ఏపీ అంటే మోదీకి అసూయ. గుజరాత్‌కన్నా ఏపీ మించిపోతుందనే భయం. ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్‌ పంతం. తన చేతగాని తనం భయటపడుతుందని కేసీఆర్‌కు భయం. తన కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయం. అసూయపరులంతా ఏకమయ్యారు. అక్కసుతోనే బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ ఒకే చోటుకు చేరి ఏపీపై కుట్రలు చేస్తున్నాయి' అని ఆరోపించారు.

'గద్దల మాదిరిగా ఏపీపై వాలి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు. తెలంగాణలో సెంటిమెంట్‌ రెచ్చగొట్టారు.. ఇప్పుడు ఏపీలో కులాల మధ్య చిచ్చు రగిలిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్పందనలేదు. హడావుడిగా నిన్న జగన్‌తో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయింది' అని విమర్శించారు.బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చాలని కుట్ర జరుగుతుందని అన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అజెండా అమలుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ అని విమర్శించారు. పార్టీలను గందరోగళ పరిచి.. ప్రజల్లో  అయోమయం పెంచడం వీరి లక్ష్యం అని ఆరోపించారు. 

ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారన్నారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. 26 కులాలకు అన్యాయం చేసిన వారితో జగన్‌ అంటకాగుతున్నారు. టీఆర్ఎస్ తో జట్టుకట్టిన వైసీపీకి 26 కులాల బీసీలే బుద్ధి చెప్పాలి' అని పిలుపునిచ్చారు. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్‌ కౌగిలించుకున్నారు. అవినీతి గొంగళిపురుగుతో స్నేహం తెలంగాణ కోసమేనా? ప్రజలకు కేసీఆర్‌, కేటీఆర్‌ జవాబు చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేసారు.