అసెంబ్లీకి 24 సార్లు.. కోర్టుకి 240 సార్లు

 

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి వెనుకబడిన వర్గాలు ఎప్పుడూ కంచుకోటగా ఉంటున్నాయని అన్నారు. మత్స్యకారులకు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం చేసే బాధ్యత తమదని చెప్పారు. వెనుకబడిన వర్గాల కోసం 21 కార్పొరేషన్లు పెట్టామని వివరించారు. జగన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ శుక్రవారం కోర్టుకెళ్తాడు.. అసెంబ్లీకి మాత్రం రాడని విమర్శించారు. అసెంబ్లీకి 24 సార్లు వచ్చిన జగన్‌.. కోర్టుకు మాత్రం 240 సార్లు వెళ్లారని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకుడు కావాలా అని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం కోసం  ఎంతటి వారినైనా ఎదిరించే సత్తా తనకుందన్నారు. కేసీఆర్‌కు భయపడే ప్రసక్తే లేదని.. అలాంటి వారిని తన రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానన్నారు. హైదరాబాద్‌ని మనం అభివృద్ధి చేసిస్తే కేసీఆర్‌ అనుభవిస్తున్నారన్నారు. కొత్తగా కేసీఆర్‌.. బంగారు బాతుని సృష్టించలేదని సెటైర్ వేశారు. హైదరాబాద్‌ మాదిరిగానే అమరావతి కూడా బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.