ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేక ఏపీకి పట్టిన శని అనుకోవాలా?

 

పోలవరం రీటెండరింగ్ పై హైకోర్టు స్టే విధించి వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని బాబు ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదని విమర్శించారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు.
 
సీఎం జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని బాబు విమర్శించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రం పదేపదే చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు. పోలవరంలో లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టెండర్లను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఎన్నో సార్లు చెప్పారని బాబు అన్నారు. ఒకసారి న్యాయ వివాదం మొదలైతే... ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడుతుందని, తీవ్ర జాప్యం జరుగుతుందని బాబు వ్యాఖ్యానించారు.