అందులోనూ కక్కుర్తి.. ఇళ్లను కరోనా కేంద్రాలుగా మార్చేశారు

పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు భారీ దోపిడీకి శ్రీకారం చుట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడికక్కడ కుంభకోణాలు చేస్తూ, వైసీపీ నేతలు తమ పొట్టలు పెంచుకుంటున్నారని విమర్శించారు. పేదలకు హౌసింగ్‌ అంటూనే వారి ఇళ్లు కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకివ్వలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇళ్లను కరోనా కేంద్రాలుగా మార్చేశారని ఆరోపించారు. గ్రామాల్లో మేం రెండున్నర సెంట్ల స్థలం ఇస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని ఒకటిన్నర సెంటుకు తగ్గించిందని విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో మేం రెండు సెంట్ల స్థలం ఇస్తే వీళ్లు ఒక సెంటే ఇస్తామనే పరిస్థితి వచ్చింది అన్నారు. 

కుప్పంలో ఏం పాపం చేశారని ఆ పేదవాళ్ల ఇళ్లు కూలగొడుతున్నారు? అని ప్రశ్నించారు. పేదల ఇళ్ల పేరుతో ఈ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. లాగేసుకున్న భూముల ధరలు రెండున్నర రెట్లు పెంచేసి వీళ్లు దోచుకుంటున్నారు. చివరికి పేదవాళ్లకు ఇళ్లు కట్టించడంలోనూ కక్కుర్తి పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. కరోనాను అదుపు చేయడం మానేసి రాజకీయ కక్షలకు వైసీపీ ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను వేధిస్తున్నారు అని చంద్రబాబు మండిపడ్డారు.