రైతు దగా దినోత్సవం.. ఒక్కో రైతుకు రూ. 80 వేలు నష్టం

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వ్యవసాయ బడ్జెట్‌లో 35శాతం మాత్రమే ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదని విమర్శించారు. 65 శాతం బడ్జెట్ రైతులకు ఖర్చు చేయలేక పోవడం మీ చేతగానితనం కాదా.. ? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ జరపాల్సింది రైతు దినోత్సవం కాదని, రైతు దగా దినోత్సవమని విమర్శించారు. వ్యవసాయానికి 10 శాతం బడ్జెట్ పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. టీడీపీ హయంలో ఐదేళ్లలో వ్యవసాయానికి 90వేల కోట్ల నిధులు కేటాయించామని చంద్రబాబు తెలిపారు.

వైసీపీ సర్కారు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కొత్తది కాదని, అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతు భరోసా పథకం తీసుకువచ్చారని అన్నారు.  రైతు భరోసా పేరుతో 5 ఏళ్లలో ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది రూ37,500 మాత్రమే అని, అదే టీడీపీ ప్రభుత్వం వచ్చి వుంటే ఒక్కో రైతుకు రూ. లక్షా 20 వేలు వచ్చేవని తెలిపారు. ఒక్కో రైతుకు 5 ఏళ్లలో రూ. 80 వేలు నష్టం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం ఇచ్చేది కాకుండా.. బడ్జెట్ లో చెప్పిన సంఖ్యలోనే 10 లక్షల మంది రైతులకు భరోసా ఎగ్గొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.