విజయసాయిరెడ్డికి పుట్టినరోజు కానుకలు.. పైశాచిక ఆనందాలు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇలాంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. 108, 104 వాహనాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. జూలై 1 విజయసాయిరెడ్డి పుట్టినరోజు అని, ఆయనకు పుట్టినరోజు నాడు ఇన్ని అంబులెన్స్ లతో కానుక ఇచ్చారని, అంబులెన్స్ ల వ్యవహారంలో 307 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన సంస్థకు అంబులెన్స్ ల నిర్వహణ అప్పగించారని మండిపడ్డారు. మీకు కావాల్సిన వాళ్లకు వాహనాలు ఇచ్చేందుకు ఇంత షో చేస్తారా? ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడతారా? అంటూ విరుచుకుపడ్డారు. తాము గతంలోనే 1500 అంబులెన్స్ లు ఇచ్చామని, వాటిలోనూ అత్యాధునిక సౌకర్యాలున్నాయని తెలిపారు. కరోనాను కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు విమర్శించారు.

అచ్చెన్నాయుడి అరెస్ట్ తీరు చాలా దారుణమని, ఒక టెర్రరిస్టును అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మీవి పద్ధతిలేని రాజకీయాలు అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి విషయంలో వైసీపీ ప్రభుత్వం మానవ హక్కులు ఉల్లంఘించడంతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఒక వ్యక్తి శస్త్రచికిత్స చేయించుకుంటే అతడిని ఎలా అరెస్ట్ చేయాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా, ప్రభుత్వం కావాలనే అచ్చెన్నాయుడి విషయంలో భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. తనకు అనారోగ్యంగా ఉందన్నా గానీ, కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంచినా గానీ అచ్చెన్నాయుడిని కావాలనే డిశ్చార్జి చేశారు. వీల్ చెయిర్ లో బయటికి తీసుకొచ్చి, అంబులెన్స్ లో ఎక్కించుకుని జైలుకి తీసుకెళ్లారు. ఇది పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.