TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మోదీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?.. కొత్త టీం రాబోతుంది

Published on: Sat May 11, 2019 11:34AM

 

ప్రధాని మోదీ.. ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ పరోక్షంగా చురకలంటించిన విషయం తెలిసిందే. "మొదటి మూడు విడత ఎన్నికల సమయంలో విపక్షాలన్నీ నన్నే టార్గెట్ చేశాయి. కానీ గాలి ఎటు వీస్తుందో అర్థమయాక యూటర్న్ తీసుకున్నారు. ఓడిపోతామని తెలిశాక ఇప్పుడు ఈవీఎంలను నిందిస్తున్నారు. క్రికెట్‌లో ఔటైన బ్యాట్స్‌మెన్ కొన్నిసార్లు అంపైర్‌ను దుర్భాషలాడతారు. ప్రస్తుతం విపక్షాలు అలాగే చేస్తున్నాయి. అనవసరంగా ఎన్నికల సంఘాన్ని దూషిస్తున్నాయి." అని మోదీ వ్యాఖ్యానించారు.

తాజాగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. "మా పోరాటం భారత ఎన్నికల సంఘంపై కాదు. మా పోరాటం అధికారుల వివక్షతపై, పక్షపాత ధోరణిపైనే. మోదీ, అమిత్ షాలపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఈసీ అమలు చేయకపోవడంపైనే మా పోరాటం." అని స్పష్టం చేశారు.

"ఎన్నికల షెడ్యూల్‌కు 73 రోజులు తీసుకున్న ఈసికి 50% వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం..? నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారు..? 50% వీవీ ప్యాట్‌లు లెక్కించాలని ఈసీని ప్రతిపక్షాలు అడిగితే మోదీకి ఏం సంబంధం, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు?" అని ప్రశ్నించారు.

"రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా మోదీ వెనుకాడరు. రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతులు ప్రబోధిస్తారు." అని విమర్శించారు.

"మే 23న దేశ ప్రజలు ప్రధానిగా మోదీ, అతని టీమ్‌ను తిరస్కరించడం ఖాయం. అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్‌నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ టీమ్‌కు పరాజయం ఖాయం. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్‌ను ప్రజలే ఎంపిక చేసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు." అని వ్యాఖ్యానించారు.