'ఎన్టీఆర్‌కు వెన్నుపోటు'పై చంద్రబాబు రియాక్షన్

 

విజయవాడలో లక్ష ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు సభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నన్ను తిట్టడం కోసమే మోదీ ఢిల్లీ నుంచి వచ్చారు. తిట్టేసి పారిపోయారని విమర్శించారు. తిట్టడం సులభమని, పనులు చేయడం కష్టమని అన్నారు. ఏం చేశారో జవాబు చెప్పలేకపోయారు అని విమర్శించారు. ఎందుకు అన్యాయం చేశారని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం ఇప్పటికే పోరాడుతూనే ఉన్నాం అన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ రాష్ట్ర విభజన చేస్తే అందుకు బీజేపీ కూడా సమర్థించిందని అన్నారు. ఈ అంశంలో రెండు పార్టీలకు కూడా బాధ్యత ఉందని అన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికిస్తారా అన్న మోదీ.. ఇప్పుడు ఆ తల్లిని కూడా దగా చేశారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని 29 సార్లు ఢిల్లీ వెళ్లా. రాష్ట్రానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అని మండిపడ్డారు. మోదీ హయాంలో గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోస్తే.. రాజీనామా చేయాలని తానే డిమాండ్‌ చేశానన్నారు. అది మనసులో పెట్టుకుని మోదీ మాట్లాడుతున్నారని ఆరోపించారు.

కేసుల మాఫీ కోసమే జగన్‌ బీజేపీతో లాలూచీ పడ్డారు. బీజేపీ సభకు జనం రారని తెలిసి వైసీపీ జన సమీకరణ చేపట్టింది అని ఆరోపించారు. నేనేదో యూటర్న్‌ తీసుకున్నానని మోదీ అంటున్నారు. నాది రైట్‌ టర్న్‌. మీదే యూటర్న్‌ అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచామని మోదీ తనపై విమర్శలు చేశారని, నిజానికి వెన్నుపోటు పొడిచింది తాను కాదని, గురువుకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర మోదీదేనని అన్నారు. తనను చేరదీసి ఆదరించిన అద్వానీకి వెన్నుపోటు పొడిచింది మోదీ కాదా అని ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల అనంతరం మోదీని తీసేయాలని వాజ్‌పేయి సిఫారసు చేసినప్పుడు అద్వానీనే అడ్డుపడి మోదీని ఆదుకున్నారని, అలాంటి అద్వానీ ఎదురుపడి నమస్కారం పెడితే.. తిరిగి నమస్కారం పెట్టే సంస్కారం కూడా మోదీకి లేదని విమర్శించారు.

మోదీ చెబుతున్నట్టు తాము పార్టీలేమీ మార్చలేదని, ఎన్టీఆర్ పేరు పెట్టిన పార్టీలోనే ప్రజాసేవ చేస్తున్నామని, ఏరోజూ తాము అవకాశవాద రాజకీయాల జోలికి పోలేదని చెప్పారు. 'ఆయన ఛాయ్ వాలా అంటారు. లక్షలు, కోట్ల రూపాయల సూటు, బూటు వేస్తారు. నేను అప్పడూ ఇప్పుడూ ఒకే తరహా డ్రెస్ వేసుకుంటాను అన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు స్పందించారు. కేంద్రంలోని కాంగ్రెస్‌తో, అప్పటి ప్రభుత్వ దురహంకారంతో తాము ఆనాడు పోట్లాడామని, ఇవాళ అదే స్థానంలో బీజేపీ న్యాయకత్వంలో అన్యాయం జరుగుతుంటే దేశాన్ని కాపాడేందుకు పోరాడితే తప్పేమిటని ప్రశ్నించారు. పోరాడటమే కాదు.. ఇంకా గట్టిగా పోరాడతామన్నారు.