పుల్వామా పనిచేయలేదు.. అందుకే అయోధ్య తెరపైకి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు, మోదీకి ఓటేసినట్లేనని విమర్శించారు. ఫారం-7లో 95శాతం బోగస్ అని ఈసీ అధికారే చెప్పారన్నారు. ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలని కోరారు. మా ఓట్లు తొలగించి మమ్మల్నే ఓటడుగుతారా? అని వైసీపీ నేతలను ప్రజలంతా నిలదీయాలన్నారు. అంతేగాక మమ్మల్ని బతికుండగానే చంపేస్తారా అని ప్రశ్నించాలని, రేపు మా ఆస్తులు కూడా ఇలాగే గల్లంతు చేస్తారా? అని రేపు బూత్‌ల వద్ద ఓటర్లే వైసీపీని నిలదీయాలన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కుట్రల కూటమిగా మారాయన్నారు. టీడీపీ ప్రభుత్వం వల్లే భూముల ధరలు పెరిగాయని, వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలతో భూముల ధరలు పతనం అయ్యాయన్నారు. రాజధానిలో, జిల్లాల్లో రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. ‘పుల్వామా ఘటన పనిచేయలేదు.. అందుకే మళ్లీ అయోధ్యను తెరపైకి తెచ్చారు..’, దేశాన్ని, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడమే మోదీ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.