వందమంది కేసిఆర్, జగన్ లు కలిసినా ఏం చేయలేరు

 

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ పార్కు, వావిలాల ఘాట్‌ ప్రారంభించారు. సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఒక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్‌ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటైందన్నారు. ఎన్టీఆర్‌ భారీ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్రని, చరిత్రలో మళ్లీ అలాంటి యుగపురుషుడు పుట్టడని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనతో ఎవరూ పోటీ పడలేరు.. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని, సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లని నిర్వచించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చంద్రబాబు కొనియాడారు.

రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, రాష్ట్రానికి బీజేపీ మేలు చేస్తుందని భావించామన్నారు. కానీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తెలుగుజాతి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. కేంద్రం సహకరించక పోయినా ప్రాజెక్టులకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయని, దానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేస్తున్నామన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా 8శాతం సేద్యంలో వృద్ధిరేటు సాధించిన ఏకైక ప్రభుత్వం మనదేనని అన్నారు. రైతులకు రూ. 24 వేల కోట్ల రుణ విముక్తి చేసిన ప్రభుత్వం టీడీపీయేనని అన్నారు. కేంద్ర హోంమంత్రి ఈ రోజు కడపలో పర్యటిస్తున్నారని, హోదా విషయంలో మోసం చేసి మళ్లీ ఎందుకు వచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. తుపాన్ వస్తే, రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడికి రారని, గుంటూరులో పార్టీ ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి మాత్రం వస్తారని చంద్రబాబు కేంద్రంపై మండిపడ్డారు. పుండు మీద కారం చల్లి సంతోషిస్తున్నారని, విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలయి ఉంటే తమకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. రాష్ట్రంలో కష్టాలకు, ఇబ్బందులకు ప్రధాని మోదీయే కారణమని అన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. వందమంది కేసిఆర్, జగన్ లు కలిసినా ఆంధ్రప్రదేశ్ ను ఏమీ చేయలేరని చంద్రబాబు అన్నారు. నాకేదో గిప్ట్ ఇస్తానని కేసిఆర్ బెదిరిస్తున్నాడని.. కేసిఆర్ ఒక్క గిప్ట్ ఇస్తే తెలుగు ప్రజలు మూడు గిప్ట్ లు ఇస్తారన్నారు. కేసిఆర్ కు అవినీతి తమ్ముడు జగన్ తోడయ్యాడని విమర్శించారు.