ఎవరండీ కెసిఆర్..పడుకొంటే లేవడు: బాబు

 

 

 

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెరాస అధినేత కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. మీడియా సమావేశంలో కేసిఆర్ చేసిన ఆరోపణల ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు మండిపడ్డారు. ఎవరండీ కెసిఆర్..ఫాం హౌస్‌లో పడుకొంటే లేవడు.. నా గురించి మాట్లాడేవాడయ్యాడా? తెలంగాణ కోసం ఏం చేశారు? అని ప్రశ్నించారు.

 

30 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం ఏం చేశాడు? గాడిద చాకిరీ చేసి హైదరాబాద్‌ను ఈ స్థాయికి తెచ్చింది నేను. ''ఎవరి హయాంలో తెలంగాణ.. హైదరాబాద్ అభివృద్ధి చెందాయో చర్చిద్దాం. దమ్ముంటే రండి'' అని సవాల్ విసిరారు. ఇంటికి మూడెకరాల పొలం ఇస్తానని, కాలు అడ్డం పెడితే గోదావరి నీళ్లు వస్తాయని నోటికి వచ్చిన మాటలు చెప్పాడు. కాలు అడ్డం పెడితే నీళ్లు వస్తాయా? ఏనాడైనా ప్రజల సమస్యలపై బయటకు వచ్చి పోరాడిన చరిత్ర నీకు ఉందా? అని ధ్వజమెత్తారు.



గత ఎన్నికల్లో 45 సీట్లు ఇస్తే పది గెలుచుకోవడం చేతకాలేదని, నువ్వు కూడా మాట్లాడేవాడివేనా? అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. దొంగలు, దోపిడీదారులని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా దోపిడీదారులా? అమెరికాలో ఉండి సంపాదించుకొని వచ్చిన నీ కొడుకు కూడా దోపిడీ దొంగేనా? అని బాబు నిలదీశారు.  కేసీఆర్, జగన్ కలిసి తెలుగు వారి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ధ్వజమెత్తారు. ఇది ఇటలీ మాఫియా తెలివి. పని చేసిన చరిత్ర నాది. మాట్లాడే హక్కు నాది. తెలుగు వారికి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, గల్ఫ్‌లో, ఉత్తరాఖండ్‌లో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. హైదరాబాద్‌లో వచ్చినా ఉంటాం' అని భరోసా ఇచ్చారు.