కేసీఆర్... జగన్... ఇద్దరూ ఒక్కటే... మీడియా ఆంక్షలపై నిప్పులు చెరిగిన టీడీపీ

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరి పోకడలూ ఒకేలా ఉన్నాయన్న తెలుగుదేశం నేతలు.... మీడియా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులూ ద్వేషం పెంచుకున్నారని మండిపడ్డారు. తమకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దన్న అహంకారంతో కేసీఆర్, జగన్ వ్యవహరిస్తున్నారని... ఇద్దరు ముఖ్యమంత్రుల నియంతృత్వ పోకడలపై మేధావులు మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు. జగన్ విధానాలపై ట్విట్టర్లో విరుచుకుపడ్డ బాబు.... ఫెయిల్యూర్ సీఎం అంటూ ట్వీట్స్ చేశారు. తప్పును ఎత్తిచూపించే వాళ్ల నోళ్లు నొక్కేయాలనుకోవడం.... వైసీపీ ప్రభుత్వ పిరికితనానికి రుజువన్నారు. వాక్కు స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిందని, వాటిని హరించడం అప్రజాస్వామికమన్నారు. తమ పనుల పట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకిలా భయపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇక, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. మీడియాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు. జగన్ ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోందన్న డొక్కా... మీడియాపై ఆంక్షలు సరికాదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ డొక్కా మాణిక్యవరప్రసాద్.... తెలుగుదేశంలోనే ఉంటానని తేల్చిచెప్పారు.