పల్నాడులో టీడీపీ నేత హత్య.. వైసీపీ మర్డర్ పాలిటిక్స్‌పై చంద్రబాబు ఫైర్..
Published on: Thu Jan 13, 2022 11:01AM
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీని వెంటాడి వేటాడుతోంది. రాష్ట్ర స్థాయి నేతలను కేసులు, అరెస్టులతో భయపెడుతుంటే.. కిందిస్థాయి లీడర్లపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా హత్యా రాజకీయాలకు అంతే లేకుండా పోయింది. వైసీపీని ధిక్కరించే తెలుగు తమ్ముళ్లను హత మారుస్తున్న ఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయంటూ టీడీపీ మండిపడుతోంది.
తాజాగా, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. హత్యకు గురైన చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఒక్క పల్నాడులోనే ఇప్పటి వరకు పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు చంద్రబాబు. గతంలో స్థానిక ఎన్నికల సమయంలో పార్టీ కార్యక్రమానికి వెళ్లిన టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. ఆనాడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే వైసీపీ బరితెగింపులకు అడ్డుకట్ట పడేదని మండిపడ్డారు. దాడులు చేసిన వారికి పదవులు కట్టబెట్టి విష సంస్కృతిని జగన్ చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అరాచక పాలనలో ఇప్పటికే రాష్ట్రంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ రెడ్డి దారుణ పాలనపై తిరగబడుతున్న టీడీపీ క్యాడర్‌ను, ప్రజలను భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండ సాగిస్తోందని దుయ్యబట్టారు చంద్రబాబు.
పల్నాడులో అసలేం జరిగిందంటే...
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య (36) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. చంద్రయ్యకు అతని రాజకీయ ప్రత్యర్థుల మధ్య గత కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్నాయి. చంద్రయ్య గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ప్రత్యర్థులు పథకం ప్రకారం బైక్‌కు కర్ర అడ్డు పెట్టి కిందపడేశారు. అతనిపై కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు.
చంద్రయ్య హత్యతో గుండ్లపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతానికి హత్య జరిగిన 2 గంటల తర్వాత పోలీసులు రావడంపై చంద్రయ్య కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


