TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భీమ్లా నాయక్‌కు చంద్ర‌బాబు స‌పోర్ట్‌.. జ‌గ‌న్‌రెడ్డి ఉగ్ర‌వాద‌మంటూ ఫైర్‌..

Published on: Fri Feb 25, 2022 11:13AM

ఇప్పుడంతా భీమ్లా నాయ‌క్ జోష్‌. ప‌వ‌న్ సినిమాకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. అవ‌న్నీ దాటుకొని మ‌రీ సూప‌ర్ హిట్ కొడుతోంది. ఏపీ రెవెన్యూ యంత్రాంగాన్ని భీమ్లా నాయ‌క్ థియేట‌ర్ల ద‌గ్గ‌ర మోహ‌రించినా.. సినిమా క‌లెక్ష‌న్ల‌ను కానీ, హిట్ టాక్‌ను కానీ.. అడ్డుకోలేక‌పోయారు. పీకే సినిమాపై.. ప్ర‌భుత్వ‌మే ఇలా దాడికి పూనుకోవ‌డాన్ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. భీమ్లా నాయ‌క్‌కు మ‌ద్ద‌తుగా వ‌రుస ట్వీట్లు చేశారు. 

రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు సీబీఎన్‌. 

భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమా పై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి.. థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం.. అన్నారు. 

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది...నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.. అంటూ ట్విట్ట‌ర్‌లో జ‌గ‌న్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు చంద్ర‌బాబు.