వివేకా హత్యలో జగనే దోషి!.. బోనులో నిలబెట్టాలన్న చంద్రబాబు
Published on: Mon Feb 28, 2022 4:44PM
వైఎస్ కోటలోనే వైఎస్ తమ్మున్ని హత్యచేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా? అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాజాగా బయటకు వస్తున్న వాంగ్మూలాలతో జగనే దోషి అని స్పష్టం అవుతోందన్నారు. కేసును మొదటి నుంచి తప్పుదోవ పట్టిస్తున్న జగన్‌ను సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని అన్నారు. ప్రతీ సమస్యకు, ప్రతి ప్రశ్నకు.. డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్.. వివేకా హత్య కేసులో ప్రజలను ఏమార్చలేరని అన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేసి, సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుని ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా? అని నిలదీశారు చంద్రబాబు.
నాడు సీఎంగా ఉన్న నాపై హత్యానేరం మోపి ఎన్నికల్లో జగన్ రాజకీయ లబ్ధి పొందారనేది రుజువయ్యిందని చంద్రబాబు అన్నారు. తండ్రి హత్యపై న్యాయం చెయ్యాలని కోరిన సునీత పట్ల.. అన్నగా వ్యవహరించిన తీరుతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారని విమర్శించారు. విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే హక్కు గాని.. సీఎం చైర్ లో కూర్చునే అర్హత గాని.. జగన్‌కు లేవని చంద్రబాబు మండిపడ్డారు.
హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది? తనపై 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడం అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని సూచిస్తోందని అన్నారు. తన అవినీతి డబ్బుతో దేనినైనా మేనేజ్ చేయగలననే అహంకారాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు.
వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్.. ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యలో సూత్రధారి ఎవరో అనేది ఇప్పుడు తేలిపోయిందన్నారు. నాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి.. ఇప్పుడు సీబీఐ విచారణను తప్పు పట్టడం వరకూ.. హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు.


