జగన్ పాలన ప్రజలకు భారం.. పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాలని బాబు డిమాండ్
Published on: Sat Nov 6, 2021 4:05PM
చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచించడంతో ఆదిశగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే 22 రాష్ట్రాలు తమ పరిధిలోని వ్యాట్ శాతాన్ని కొంత తగ్గించుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం మౌనం వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ రేట్లలో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉండగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. కేంద్రం తగ్గించినా వ్యాట్ తగ్గించకపోవడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై జనాలు ఫైరవుతున్నారు. విపక్షాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పెట్రో ధరలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికం అని అన్నారు. అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గిస్తుంటే ఏపీలో ఎందుకు తగ్గించడంలేదంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ప్రస్తుత పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రో ధరల పెంపును తీవ్రంగా పరిగణించాల్సిందేనని, పెట్రో ధరల పెంపు ప్రభావం అనేక రంగాలపై ఉంటుందని చంద్రబాబు అన్నారు. ధరల పెంపు కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ప్రజలపైనా తీవ్ర భారం పడుతోందని వివరించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని నాడు జగన్ చెప్పారని గుర్తు చేశారు. నాడు పెట్రోల్ ధరలు తగ్గించాలని ఆందోళన చేసిన జగన్.. ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.


