కల్తీ సారా పాపం వైసీపీదే.. కోటి పరిహారానికి చంద్రబాబు డిమాండ్..
Published on: Mon Mar 14, 2022 4:34PM
ఏపీలో కల్తీ సారా ఏరులై పారుతోంది. నాటు సరుకుకు పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. ఒకేసారి అంతమంది చనిపోవడం ఏపీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ పాలనలో.. రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కల్తీ సారాను వైసీపీ నేతలే విక్రయిస్తున్నారన్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి రాజ్యంలో గంజాయి, డ్రగ్స్ నుంచి కల్తీ మద్యం వరకూ.. అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చంద్రబాబు పర్యటించారు. కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రాష్ట్రంలో మద్యం తయారీ నుంచి విక్రయం వరకు సీఎం జగనే చేస్తున్నారన్నారు. కల్తీ సారా నియంత్రించే వరకూ తన పోరాటం కొనసాగుతుందని.. ఎందరిని జైలులో పెట్టినా కేసులకు భయపడబోమన్నారు చంద్రబాబు.
బాధిత కుటుంబాలకు టీడీపీ తరఫున.. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున.. మొత్తం 26 కుటుంబాలకు.. 26 లక్షలు సాయం చేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ.. టీడీపీ ఉద్యమం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.


