సంక్రాంతి పూట జగన్ సర్కారు అరాచకం.. క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్
Published on: Sat Jan 15, 2022 10:55AM
ఏపీ రైతాంగానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు రైతు నరేంద్ర జైలులో ఉండడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు చంద్రబాబు.
పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించదన్నారు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించిందని విమర్శించారు. రైతుల పండుగైన సంక్రాంతి నాడు.. ఓ రైతును జైల్లో పెట్టి యావత్ రైతాంగానికే పండగ సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు.
వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయిందని.. తప్పుడు కేసు పెట్టిన సీఐని ఇప్పటికే సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని వెంటనే రైతు నరేంద్ర ను విడుదల చేయాలని.. వేధింపులకు గురిచేసినందుకు అతని కుటుంబానికి పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


