ఆ సీటు విషయంలో దూరాలోచన చేసిన బాబు

 

 

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో ఓటమి నుండి బయట పడే ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగానే పార్టీ వీడిన వీడుతున్న నేతల నియోజకవర్గాల మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ధర్మవరం నియోజకవర్గం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికే అప్పజెబుతామని అనంతపురం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సభలో ప్రకటించారు.

రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల బాధ్యతలు పరిటాల కుటుంబానికే ఇస్తున్నామని కానీ పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ ఎవరు ఎక్కడ బాధ్యతలు తీసుకుంటారో వారి నిర్ణయానికే వదిలేస్తున్నామని చంద్రబాబు స్పష్టంగా చెప్పుకొచ్చారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలకి ఐదేళ్ళ సమయం ఉండగానే పరిటాల కుటుంబానికి ధర్మవరం నియోజకవర్గం టీడీపీ బాధ్యతలు అప్పగించడం ద్వారా రాబోయే ఎన్నికల నాటికి ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. పరిటాల ఫ్యామిలీని పార్టీలోకి రప్పించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో పరిటాల ఫ్యామిలీ కావాల్సిన రాప్తాడు, ధర్మవరం బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ కుటుంబం ఆ ఆలోచన చేయకుండా చేసినట్టయ్యింది.