ప్రభుత్వ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తీవ్ర విమర్శలు...

 

హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందని టిడిపి అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గురువారం ఆయన లేఖ రాశారు. 

కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు విడతలుగా పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి పంపింది. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి మూడు రోజుల్లోగా రాష్ట్ర ఉపాధి హామీ నిధుల బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే తదుపరి నిధులు విడుదల నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే జాప్యం చేసిన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు శాతం వడ్డీ కూడా చెల్లించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించాలని పాత పెండింగ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం తన ఆదేశాల్లో సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేదు. ఈ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులూ పేరుకుపోవడంతో అవి రావలసిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కొన్ని చోట్ల ఈ పరిణామం ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉపాధి హామీ పథకానికి చెడ్డ పేరు తెస్తుందని బిల్లులు పేరుకుపోవడంతో ఈ పథకంతో జత కలిపి పనులు చేయటానికి ప్రభుత్వ విభాగాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు. 

ఉపాధి హామీ పథకం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ పరిస్థితి పై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చారని గవర్నర్ ను కూడా కలిసి వివరించారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనుసాగితే అతి త్వరలోనే ప్రజలు ఈ పథకం పై విశ్వాసం కోల్పోతారని ఫలితంగా గ్రామీణాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ గత ఐదేళ్లలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ఈ పథకం నిధులతో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ఆరు వేల అంగన వాడీ భవనాలు, రెండు వేల రెండు వందల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, పదివేల సాలిడ్ వేస్ట్ కేంద్రాలూ, ఏడు లక్షల పంటకుంటలు నిర్మించామని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నెండు వేల కిలోమీటర్ల మేర గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎనభై మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ముప్పై మూడు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మొదటి పది లో ఏడు కూడా ఈ రాష్ట్రానికి చెందినవే అని తెలియజేశారు. దీనిని పరిశీలించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్రం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తన దృష్టని పెట్టారని స్పష్టంగా వెల్లడవుతోంది.