టీడీపీకి 116 సీట్లు.. రాయలసీమలో ఊహించని ఫలితాలు

 

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో వైసీపీదే అధికారమని అంచనా వేస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం.. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దని, నూటికి నూరు శాతం మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబు తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు గెలుపు మనదేనన్న భరోసా ఇచ్చారట. ప్రతిపక్షాల మైండ్‌గేమ్‌లో పడాల్సిన అవసరం లేదని, వారు చేస్తోన్న హంగామాకు బెదిరిపోవద్దని, గెలుపు మనదేనని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. టీడీపీకి 116 సీట్లు వస్తాయని, దాని కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు టీడీపీ వైపు నిలబడ్డారని అన్నారట. కేంద్రం, ఎన్నికల కమీషన్‌ సహాయంతో వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తట్టుకుని నిలబడ్డామని, గెలుపు మనదేనని, సంబరాలకు సిద్ధంగా ఉండాలని బాబు చెప్పినట్లు తెలుస్తోంది.

వైసీపీకి పట్టున్న రాయలసీమలో కూడా టీడీపీ ఘన విజయం సాధించబోతోందని బాబు ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. "గతంలో చిత్తూరులో టీడీపీకి 7 సీట్లు వస్తే.. ఈసారి మరో రెండు సీట్లు పెరుగుతున్నాయి. అదే విధంగా అనంతపురంలో వచ్చిన 12 సీట్లను నిలబెట్టుకుంటున్నామని, కర్నూలులో గతంలో 3 సీట్లు వస్తే.. ఈసారి తొమ్మిది సీట్లు సాధించబోతున్నామని, కడపలో మరో సీటు వస్తుందని.. గతానికంటే పది సీట్లు సీమలో అదనంగా గెలుచుకోబోతున్నాం" అని బాబు అన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో చూసుకోవాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పారట.  ఇక ప్రకాశంలో ఏడు, నెల్లూరులో నాలుగు సీట్లు వస్తున్నాయని అన్నారట. రాజధాని ప్రాంతమైన  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పదికి తగ్గకుండా వస్తాయని, గోదావరి జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉందని, ఉత్తరాంధ్రలో మెజార్టీసీట్లు సాధిస్తామని తెలిపారట. మరి బాబుకి తమ గెలుపుపై ఉన్న నమ్మకం నిజమవుతుందో లేదో రేపు తెలుస్తోంది.