వైసీపీలోకి ఎంపీ అవంతి.. తెలంగాణలో ఆస్తులే కారణం

 

ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, మోదీ ఇద్దరినీ జగన్ కాదనలేరని.. ఎందుకంటే ఇద్దరిలో ఎవరిని కాదన్నా జగన్ వెంటనే జైలుకు వెళ్తారని విమర్శించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కాకూడదనేదే ముగ్గిరి ఆలోచన అని, ముగ్గురి కుట్రలను ప్రజాక్షఏత్రంలో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను మించి అమరావతి అభివృద్ధి చెందితే మనుగడ ఉండదనేది వారి భయమన్నారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం.. కేంద్రంతో చేసే యుద్ధంలో గెలుపే మన లక్ష్యం’ అని అన్నారు. ఎన్నికల ముందు కూటమి అసాధ్యం అన్నారని, తాము ముందస్తుగా కూటమి ఏర్పాటు చేశామని చెప్పారు. కూటమితో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే కుట్రలు, కుతంత్రాలు పెంచారని విమర్శించారు.

అదేవిధంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీ చేరడంపై కూడా చంద్రబాబు స్పందించారు. అవంతి శ్రీనివాస్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని.. అందుకే ఆయనను బెదిరించారని అన్నారు. మొన్న తనతో ఢిల్లీలో తిరిగి నిన్న వెళ్లారంటే ఏమనాలని ప్రశ్నించారు. స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయని, పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులను ఆ వర్గం నేతలే ఖండించాలని ఆదేశించారు. తమ కుటుంబంలోనూ పురందేశ్వరి బీజేపీలో, దగ్గుపాటి వైసీపీలో ఉన్నారన్నారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని చంద్రబాబు పేర్కొన్నారు.