పార్టీలో కొత్త మొహాలేవి? నా పరువు పోతోంది.. త-మ్ముళ్లపై చంద్రన్న సీరియస్..
Published on: Sat Jan 8, 2022 2:28PM
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం వెళ్లారు. స్థానిక టీడీపీ శ్రేణులు తెగ హడావుడి చేశారు. దండలు, దండాలు, ఫ్లెక్సీలు, స్వాగతాలతో హోరెత్తించారు. చంద్రన్నకి జై కొట్టారు. పెద్దాయన ఫుల్ హ్యాపీ. గతేడాదీ ఇలానే జరిగింది. అంతకుముందటి ఏడాది.. నాలుగేళ్ల క్రితం.. ఐదేళ్ల క్రితం.. పదేళ్ల క్రితం.. 20 ఏళ్ల క్రితం.. అలా అలా 35 ఏళ్లుగా ఇదే సీన్. కానీ, ఈసారి కొంచెం ఛేంజ్. తాజాగా, కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఓ అనుమానం వచ్చింది. ఇక అంతే, చంద్రన్న ఉగ్రరూపంతో ఊగిపోయారు.
అదేంటి.. తాను ఎప్పుడు కుప్పం వచ్చినా.. జేజేలు కొడుతూ, బాగానే జెండాలు మోస్తున్నారు కానీ.... ఎప్పుడూ ఈ మొహాలే ఉంటున్నాయేంటి? 35 ఏళ్లుగా కనిపించిన వారే కనిపిస్తున్నారు.. జై కొట్టిన వారే జై కొడుతున్నారు.. కొత్త వాళ్లు ఎవరూ కనిపించడం లేదు. టీడీపీలోకి కొత్త నీరు రావడం లేదా? కొత్తగా కార్యకర్తలు చేరడం లేదా? లేదంటే.. ఏళ్లుగా పాతుకుపోయిన వాళ్లు.. తమకు పోటీ అవుతారని కొత్త వారెవరినీ రానీయడం లేదా? ఎవరినీ ఎదగనీయడం లేదా? అనే లాజికల్ డౌట్ వచ్చింది చంద్రబాబుకు. ఇక అంతే. ఒక్కసారిగా వేదికపైనే చెలరేగిపోయారు చంద్రన్న. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడూ మీరు మాత్రమే కనిపిస్తున్నారేంటి? అంటూ తమ్ముళ్లకు తెగ క్లాస్ ఇచ్చారు అధినేత. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే.....
"కుప్పంలో పార్టీలోకి యువత రాకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారు. ముప్పై అయిదేళ్లుగా మిమ్మల్నే చూస్తున్నా.. కొత్త మొహాలే కనపడటం లేదు. మిమ్మల్ని నమ్ముకొని నా పరువు పోగొట్టుకున్నా. నేను వచ్చినప్పుడు నాయకులు షో చేస్తున్నారే తప్ప ప్రజల్లో ఉండటం లేదు. మీ చేష్టల వల్లే ప్రజలు మనకు దూరమవుతున్నారు. ప్రజల్లో ఉన్న నాయకులనే నేను ప్రోత్సహిస్తా. పర్సనల్ ఎజెండాలతో పార్టీకి నష్టం చేయవద్దు. వంద ఓటర్లకు ఒక యూత్ పర్సన్ ని ఏర్పాటు చేస్తాం. వాలంటీర్లకి పోటీగా సేవా మిత్రలను ఏర్పాటు చేద్దాం. అధికారంలోకి వచ్చాక వాళ్లనే వాలెంటీర్లుగా మారుద్దాం" అని చంద్రబాబు ఆగ్రహ స్వరంతో తమ్ముళ్లకు హెచ్చరిక లాంటి సూచన చేశారు.


