చంద్రబాబుతోనే తెలుగుజాతికి పూర్వవైభవం.. ఆయనే సూపర్ స్టార్..
Published on: Wed Apr 20, 2022 1:27PM
తెలుగు జాతికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి అభివృద్ధి కోసం టీడీపీ ఎప్పుడూ పాటుపడుతుందని చెప్పారు. అందరి అంచనాలకు తగ్గట్లు పని చేస్తూ పార్టీని నడిపిస్తానని.. రాజీలేని పోరాటంతో అండగా నిలబడతానని.. తప్పకుండా విజయం సాధిస్తానని.. చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
73వ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని.. ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తిసామర్థ్యాలు ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తనను ఆశీర్వదిస్తున్నారని.. తన జన్మదినం సందర్భంగా వేడుకలు చేసుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారని.. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.
ఎన్నో త్యాగాలు చేసిన నాన్నే నా సూపర్ స్టార్ అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘పుట్టిన రోజు సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు. తెలుగువారికి చంద్రబాబు అంటే ఒక భరోసా. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్ల మందికి అన్నదాత అయ్యారు. లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. సొంత కుటుంబం కాకుండా.. తెలుగుజాతినే కుటుంబం చేసుకున్నారు. ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని పవన్ ఆకాంక్షించారు.
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ పార్టీ నేతలు, శ్రేణులు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. పలువురు పార్టీ నేతలు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పారు. తిరుమల అఖిలాండం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి.. 720 కొబ్బరికాయలు కొట్టి, 720గ్రాముల కర్పూరం వెలిగించారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత టీడీపీ కార్యకర్తలు 1,116 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు 72 కిలోల కేక్ కట్ చేస్తూ అధినేత బర్త్‌డేను ఘనంగా చేస్తున్నారు.


