ఒక పరాజయం 100 తప్పులు.. బాబు కొంపముంచిన అక్రమ కొంప!!

 

ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పిన చంద్రబాబు.. రాజధాని ప్రాంతంలో కనీసం సొంతిల్లు నిర్మించుకోకపోవడం ఆయన చేసిన పెద్ద తప్పని చెప్పక తప్పదు. ఒకవైపు కొందరు టీడీపీ నేతలేమో.. అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ కి అమరావతిలో ఇల్లు లేదని, ఆయన హైదరాబాద్ లోనే ఉంటారని విమర్శలు చేసేవారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటారని, అప్పుడప్పుడే ఏపీకి వస్తారు అంటూ విమర్శించారు. కానీ జగన్, పవన్ ఇద్దరూ అమరావతికి దగ్గరలో సొంతిల్లులు నిర్మించుకున్నారు. కానీ బాబు మాత్రం ఐదేళ్లు అక్రమ కట్టడంలో ఉండి విమర్శలు ఎదుర్కొన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించారంటూ.. కరకట్ట దగ్గర ఉన్న పలు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది టీడీపీ సర్కార్. అందులో లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. కట్ చేస్తే కొద్ది రోజులకు అదే ఇంట్లో బాబు నివాసం ఉన్నారు. అక్రమ కట్టడంలో సీఎం నివసించడం ఏంటని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కానీ బాబు పట్టించుకోకుండా అదే అక్రమ ఇంట్లో ఉన్నారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఒకవైపు జగన్, పవన్ లు సొంతిల్లు నిర్మించుకుంటే.. రాజధానిని నిర్మిస్తానన్న బాబు సొంతిల్లు కూడా నిర్మించుకోకుండా అక్రమ కొంపలో నివాసమున్నారు. ఇది బాబు మీద బాగా ప్రభావం చూపింది. వీటికి తోడు ఏపీకి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తానని చెప్పిన బాబు.. తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లోనే కొనసాగించారు. అంతేకాదు అమరావతి ప్రాంతంలో సొంతిల్లు కట్టుకోని బాబు.. హైదరాబాద్ లో మాత్రం అధునాతన ఇంటిని నిర్మించుకున్నారు. ఇవన్నీ బాబుని విమర్శలపాలు చేసాయి.