టీడీపీ పుట్టినచోట.. 40 ఏళ్ల చరిత్రకు గుర్తుగా.. తెలుగుజాతికి పునరంకితం
Published on: Tue Mar 29, 2022 6:27PM
40 ఏళ్ల టీడీపీ ప్రస్థానం. ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు. 1982 మార్చి 29న.. హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆనాడు పార్టీని ప్రకటించిన చోటే.. ఈనాడు చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరిపారు. పార్టీ శ్రేణులకు గతాన్ని గుర్తు చేస్తూ.. భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ఏమన్నారంటే....
"40ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన రోజు. తెలుగు జాతికి జరిగిన అవమానాలు చూసిన తర్వాత.. 40 సంవత్సరాలు తనను ఆదరించిన తెలుగుజాతికి ఏదైనా చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కొద్ది మందితో మీటింగ్ పెట్టారు. వేల మంది అప్పటికప్పుడు పోగయ్యారు. వాళ్ల ఆవేదన చూసిన తర్వాత అక్కడికక్కడే తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు నిర్ణయించి, పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించే ఆయన పార్టీ పెట్టారు. ధ్రువతార పెట్టిన పార్టీ ఒక చరిత్ర సృష్టించింది. ఎప్పటికైనా తెలుగు జాతి.. టీడీపీ కంటే ముందు, తర్వాత అని లిఖించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక సంక్షేమం, అభివృద్ధి, తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.. ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్."
"40 ఏళ్లలో ఎన్నో చరిత్రలు సృష్టించాం. ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాం. మరోసారి తెలుగు జాతికి పునరంకితం కావాల్సిన అవసరముంది. తెలుగు వారు ఉన్నంతకాలం తెలుగుదేశంపార్టీ ఉంటుంది. తెలుగు జాతిని, తెలుగుదేశం పార్టీని ఎవరూ విడదీయలేరు" అని చంద్రబాబు అన్నారు. అనంతరం టీడీపీ నాయకులతో కలిసి.. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు.


